పుట:కాశీమజిలీకథలు -07.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసువుల కథ

15

ప్రభా — శా. ఏమీబాలక ! మామకప్రధిత దివేడ్య ప్రభావంబు వి
               శ్వామిత్ర క్షితినేతృ నీచబలసామ్యప్రక్రియన్ బల్కెదా
               హా! మాప్రజ్ఞ వెఱుంగవీవరయబ్రహ్మర్షుల్ మముంగూర్చికా
               దే ! మోక్షాస్థపంబు సేయుదురుధాత్రిన్ వ్యక్తసర్వార్ధులై.

శిష్యు — గీ. అనిమిషప్రజ్ఞ మేమెఱుంగనిది కాదు
              పుడమి జడదారి కపకారముగఁ జరించి
              కాదె తెరఁగంటి యెకిమీడునికాయమెల్ల
              గన్నులై పోవ శప్తుఁడౌ టెన్నరొక్కొ.

అని పలుకుచుండ నమ్ముని బాలకుని మాటలఁ బాటింపక వసువుల సదృశ వేగంబున నాసౌరభేయిందీసికొని తమ కంబున కేగిరి.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం డిట్లు చెప్పండంగెను.

102 వ మజిలీకథ.

సఖీ ! జితవతీ ! నీపుణ్యము ఫలించినది. అనుకూల వాల్లభ్యంబు సంప్రాప్తించెనని యెల్లరుఁ జెప్పుకొనుచున్నారు. దివ్యరూపసంపన్నుఁడైన వరుండు లభింప నాకిప్పుడు వివాహ మక్కరలేదంటివఁట యేమిటికి? రహస్య మేమైనంగలదా యని యొకనాఁడు రోహిణి జితవతి నడిగిన నప్పఁడఁతి యిట్ల నియె. రోహిణీ ! అల్లనాఁడు మేడ మీఁద మనము సంగీతము బాడుకొనుచున్నప్పుడు యోగసక్తయను దేవకాంతవచ్చి ముచ్చటించినమాట నీవు మఱచితివి కాఁబోలును. ఆవసుపత్ని పెద్దతడవు నాతో నేకాంతముగా మాట్లాడునప్పుడు మనుష్యయోషల యస్థిరయౌవనత్వము దెలిసికొని నాకు దేవత్వము బ్రసాదింతునని వరమిచ్చి తాను వచ్చుదనుకఁ బెండ్లి యాడవలదని చెప్పి పోయినది. ఆ సుందరి నామాట మరువదు. ఎప్పుడోవచ్చి తానిచ్చిన వరము సఫలము జేయక మానదు. నాకట్టి విశ్వాసము గలిగియున్నది. ఆమె యాజ్ఞలేక నేను వివాహ మాడను. మాతల్లి తోఁజెప్పి యిప్పుడా సన్నాహము మానిపింపుము. నామాట పరిహాసముగా నెంచి లక్ష్య పెట్టకున్నదని పలికినది.

అంతలో జితవతితల్లి అక్కడకువచ్చి రోహిణీ ! అమ్మాయితో బెండ్లిమాట జెప్పితివా ! ఏమన్నది వరుని చిత్రఫలముం జూచితివా? ఈతని పేరు ప్రభాకరుఁడఁట. ఈనామ మీతనికి సార్ధకముగా నున్నది. ఇంతకంటె సుందరుఁ డీపుడమలో లేఁడని చెప్పుము. అని పలికిన నారోహిణి అమ్మా! భర్తృదారికతోఁ జెప్పితిని. ఆమె సంకల్పము వేరుగా నున్నది. యోగసక్తకథ మీకునుం జెప్పియున్నదిగదా? ఆమె వచ్చి