పుట:కాశీమజిలీకథలు -07.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఋషులు తపంబులం గావింతురు. మనరాక వారికి బ్రమోదకారణంబుగాక కోపహేతువెట్లగును ? మన మీ గోవుం గ్రహించిన వసిష్ఠుండు తన్నుఁ గృతార్థుంగాఁ దలంచుకొనును. లెండు, లెండు, పట్టుఁడు అతండలిగిన నేనడ్డుపడెదను లెండు. ఈయోగసక్తపలుకులు హేతుశూన్యములుగావు. తానిచ్చినవరము నిలుపుకొనుటకై కోరినదిగాని యాత్మార్దముగాదు. పిన్నతమ్మునిమాటఁ బాటించి యిక్కార్యంబు సాధింపవలయునని మిక్కిలి దైన్యముతో బ్రతిమాలుకొనియెను.

వానియందుఁగల మక్కు-వచే ధరుండేమియుఁ బలుక కూరకుండెను. అట్టితరి వసువులెల్లరు నలుమూలలు గాచికొని యుండఁ ప్రభాసుండు నందినీధేనువును సమీపించి గంగడోలు దువ్వుచు మచ్చికఁ గలుగఁజేసి శృంగంబులం కుచ్చుబిగించియు నగ్గోవరంబు కదలక యాత్మీయబంధుత్వము దలంచి కాఁబోలు వారికిఁ దృటిలో వశమైనది అట్టిసమయంబున వసిష్ఠ శిష్యుఁఁడొక డడ్డమువచ్చి.

శిష్యుఁడు — అఁ! ఆఁ! మా హోమధేనువును దీసికొనిపోవు చున్నారేమి ? మీ రెవ్వరు? నిలుఁడు. నిలుఁడు. ఇది వసిష్ఠమహర్షికిఁ బ్రాణసమంబని యెఱుంగరా యేమి.

ప్రభా — బాలకా ! నీవు వసిష్ఠుని శిష్యుఁడవాయేమి? దీనిం బనిగలిగియే తీసికొని పోవుచున్నారము. అమ్మహర్షితో వసువులు తీసికొనిపోయిరని చెప్పుము.

శిష్యుఁడు — వసువులన నెవ్వరు? చోరులాయేమి?

ప్రభా - చోరులుగారు దేవసభాసామాజికులు. మెయాచార్యుండు సంతతము మమ్ముఁగూర్చియే జపము చేసికొనుచుండును. మమ్మే యుపాసించును. మేము దీనిం బరిగ్రహించుటచేఁ గృతార్జుండగును.

శిష్యు — మీరు వసువులయినచో వారువచ్చుదనుక నిలిచి పూజింపఁబడి యడిగి యీమొదవుం దీసికొనిపోవుఁడు మాయావుల వలెవచ్చి మాయావుం గొనిపోవుచు మేము వేల్పులమనిన నెన్వరు గౌరవింతురు ?

వసు - బాలకా ! దేవప్రభావము నీవెఱింగిన నిట్లనవు. మనుష్యులకిట్టి పనులు దూష్యము. వేల్పులకులేదు. అదియునుంగాక నీమొదపు గశ్యపుసంతతిలోనిదగుట దీనింగ్రహింప మాకధికారమున్నది.

శిష్యు — శా. దీనిఁజూచి హరింపఁబూనుటనుకాదే కౌశికుండాత్మశౌ
               ర్యానూ నోరు బలంబులున్జెడఁగ నీర్ష్యాలోల చేతస్కుఁడై
               స్థానభ్రంశము రాజ్యనాశనముగా సన్యాసియైపోయె మున్
               మానుండీపని వేల్పులార వలదీమార్గంబు కీడౌఁజుఁడీ.