పుట:కాశీమజిలీకథలు -07.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

కాశీమజిలీకథలు - సప్తమభాగము

రమ్ము లేకున్న నిన్నుశిక్షింతునని రాజుకోపముగాఁబలికినజడియుచు రత్నాంగి వాని నిట్లడిగినది.

రత్నాంగి - ఓరీఃనీవు నిన్నసాయంకాలమున

మృగ - నిలు, నిలు నేను గోయవాఁడనుకాను. ఉత్తమకులస్థుడ ఓరీ అని నన్ను నీవు పిలువఁదగవు అందరు నవ్వుచున్నారు.

రత్నాంగి - ఓయీ తివాసి తీసికొని మాయింటికి వచ్చితివా?

మృగ -- వచ్చితిని. వచ్చితిని.

రత్నాంగి - నీపేరు చిరుతపులియని చెప్పితివా

మృగ -- చెప్పితిని. నాపేరు అప్పటికిఁ జిరుతపులియే.

రత్నాంగి - రాత్రి మాయింటికిఁ బడకకు వత్తునని జెప్పితివా?

మృగ -- నేనుఁ జెప్పలేదు. నీవు రాత్రి రమ్మని పిలిచితివి.

రత్నాంగి - ఎట్లయిన నేమి నీవు రాత్రి మాయింటికి వచ్చితివా? లేదా.

మృగ - వచ్చితిని.

రత్నాంగి -- సరే. నాకూతుఁరును నీయొద్దకు బంపితినా లేదా?

మృగ - కూఁతురో యెవ్వరో తెలియదు. ఒకతె నాగదిలోనికి వచ్చి కూర్చు న్నది.

రత్నాంగి - అది నీయిష్టము చొప్పున మెలఁగినదియా?

మృగ ‌- లేదు. లేదు

రాజు - మఱియేమి జేసినది.

మృగ - దేవా! వినుండు. ఆమెకడుయిల్లాలు. సామీ! ఆమెనన్నుఁ జూచినా వృత్తాంతమడిగి తెలిసికొని యూరక కన్నీరుగార్చుచుగొంత సేపటికిఁ బిల్లవాఁడా. నీవుయుత్తమకుల సంజాతుఁడవు కోయవాఁడవు కావు ఈబోగముదాని యింటి కేమిటికి వచ్చితివి? దీనివలనధనముపోవును. రోగములువచ్చును. కీర్తిచెడును. తేలికకలుగునని యెన్ని యోచదివి ఈపని తప్పని చెప్పినది. అంతదనుక నాకామాట తెలియదు. చదివికొని బుద్దికలిగి న్యాయముగ వర్తింపుమని యెంతయో బోధించినది. నాపుట్టు పూర్వోత్తరమువిని నీపేరుమృగదత్తుఁడని చెప్పుకొనుమన్నది. అప్పటినుండియుఁ బేరు మార్చుకొంటిని ఆమెచెప్పిన మాటలన్నియు నాకునచ్చినవి. ఆప్రకారమే నడుచు కొనుచు నియమించుకొంటిని. తెల్లవారక పూర్వమే నన్నుఁ బొమ్మన్నది. లేచివచ్చి తిని ఇంతకన్న నాకేమియుం దెలియదు. సామీ! అని వాఁడు చెప్పెను.

రాజు - రత్నాంగీ? వానిమాటలువింటివా? అచిన్నదినీకూఁతురేనా సత్యము చెప్పుము.