పుట:కాశీమజిలీకథలు -07.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

కాశీమజిలీకథలు - సప్తమభాగము

గలవాఁడనని కూడఁజెప్పుచుంటివి నన్నెట్లెరింగితివి. అనవు డామె ఆమాటలేమియు నడుగకుము. నిన్నుఁజాడ నాకట్లు తోచినది. నాచెప్పిన చొప్పున నడిచెదవేని నీవు భాగ్య సంపన్నుఁవు కాగలవని చెప్పిన వాఁడిట్ల నియె.

అమ్మా ! అకారణముగా సంపదగలగఁజేయుచుండ వలదను వాఁడుండునా? రహస్యము వెల్లడింపను జాబు వ్రాసియిమ్మని అడిగిన నప్పడఁతి యప్పుడే యొక యుత్తరమిట్లు వ్రాసినది.

ఓపుణ్యాత్ములారా ! ఈకమ్మ తెచ్చిన పిల్లి వాఁడు మీ దౌహిత్రుఁడు వీనిపేరు మృగదత్తుఁడు. వీనింగాపాడి కులమభివృద్ధి జేసికొనుడు మీకూఁతురును అల్లుండును మృతినొందిరి. వారికొరకుఁ జింతింపఁబనిలేదు. వీనికి విద్యాబుద్ధులు గరపి వృద్ధి లోనికిఁ దీసికొనిరండు. ఇదియే పదివేలు.

ఇట్లు మార్గదర్శకరాలు.

అనివ్రాసి యాయుత్తరమిచ్చి శిరము మూర్కొని ముద్దాడుచు దండ్రీ? ప్రమాదమునైనను వెలియాలి యింటికిఁ బోవకు సుమీ? పరులకు హింసగావింపకుము. ఈయుత్తర మొరులకుఁ జూపకుమని పలుమారుబోధించి నిద్రబుచ్చి తెల్లవారకమున్న లేపి అవ్వలికిఁ బంపినది.

ప్రొద్దుట రత్నాంగి పద్మినింజూచి మెచ్చుకొనుచు నోహో నీవేమో వెర్రిదాన వనుకుంటిని. మంచిజాణవే వస్తువడుగకుండ విటుని సాగనంపితివి. మఱియేమైనను సొమ్ములాగితివా? యని అడిగిన విని మాటాడక లోనకిఁబోయి సీ? నావంటి మూఢు రాలెందైనం గలదా? సర్పదష్టుఁడైన మగనివార్తవిని చావక యిన్ని నాళ్ళేమిటికి జీవించితినో తెలియదు. ఆహా? వారకాంతనుగూడ ననిపించుకొంటినిగదా? చాలు. జాలు. కీడులో మేలు నాకుమారునిగంటి. హైహికభ్రమ వదలినది. అయ్యో ! కొన్ని దినము లుండమనక నిజంబెఱింగింప పంపివేసితినేమి? ఔను జ్ఞాపకము వచ్చినది. నాయవస్థకు వాఁడు వగచుట యొకటి పుంశ్చలిగాఁ దలంచుట యొకటి. ఈవిచారము వానిం బాధించునని చెప్పితినికాను మంచిపనియే. ఇఁకచావక యేమిచేయవలసినది. అడవికిఁ బోయి యెట్లో మడిసెదఁగాక అని నిశ్చయించి అప్పుడే యెవ్వరికిఁజెప్పక యిల్లు వెడలి అడవిదారింబడి నడువఁ దొడంగినది.

ముల్లుకంపలు, రాళ్ళు, రప్పలు, రుప్పలు గణింపక తోచినట్లు నడుచుచు నొకచో దావాగ్ని మండుచుండ గుభాలునబోయి యామంటలోఁ బడినది పాతివ్రత్య మునకు మెచ్చుకొని యగ్ని భట్టారకుడు మోక్షసామ్రాజ్యమునకు బట్టాభిషిక్తం జేయు చున్నవాడో యనఁగడవలతో గుమ్మరించునట్లు వర్షము గురియుటచే నా దావాగ్ని యంతయుఁ జల్లబడినది.