పుట:కాశీమజిలీకథలు -07.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వాని మేను ఝల్లు మన్నది. పులకలు వొడమినవి. సాత్వికవికారములు తోచినవి యౌవనాంకురము పొడసూపుచున్న తరి స్త్రీసంపర్కము పురుషులకు వికారములు కలిగించుట సహజముగదా ! తద్విలాసములకుఁ జొక్కివాఁడు మొలక మీసములపైఁ జేయివైచి దువ్వుచు నీవు బోగము దానవుగదా ? నిన్ను హాస్యమాడవచ్చునని మా వాండ్రు చెప్పుదురు. రాత్రివచ్చెద నీకిదియూరక యిచ్చివేసెదఁ బుచ్చికొమ్ము. మరి యొకటి యల్లఁగలను. అని పలుకుచు దానితోఁ జెప్పి తన బసకు బోయెను.

తోడివారలా తివాసి నమ్మితివా? యని అడిగిన వాఁడు నవ్వుచు వింతలు, చూచి వచ్చితిని. రేపంతయుఁ జెప్పెద రాత్రి మరల బోవలయుఁ బెద్ద పెద్ద మిద్దెలం గంటి. అబ్బబ్బా అవి మన కొండగుబ్బలుకన్న మిన్నగా నున్నవిసుమీ! యెన్నియో బొమ్మలు గోడల ప్రక్క జక్కఁగా. వేలంగట్టిరి. ఆయందము చూచి తీరవలయు బోగముది మంచి కులాసాపనులు చేసినది. ఇంకనుం జేయఁగలదుఁ అని తన చెలి కాండ్రతో జెప్పుచు మూపు లెగరవైచుచు రాత్రి సమయ మరయుచుండెను.

ఇంతలో సూర్యాస్తమయమైనది. పూవులు, నాకులు, వక్కలు దెప్పించి పెంద లకడ భోజనము చేయవలయునని ప్రయత్నించుచుండ రత్నాంగికిఁ దలనొప్పియుఁ జలియుజ్వరము వచ్చి బాధింపదొడఁగినది.

అయ్యో కిరాతపుత్రుని రమ్మంటిని. వాఁడు వచ్చువేళయైనది దేహ మస్వస్థత జెందియున్నది మాటాడుటకైన నోపికలేదు. రత్న కంబళి యూరక పోఁగలదు. ఏమి చేయుదునని చింతించచు రత్నాంగి తనయింటనున్న వెఱ్ఱిదానిం బిలిపించి యాయాస్తరణ జూపుచు నిట్లనియె.

పడఁతీ ! యిది మిక్కిలి వెలగలది యెంత వింతవింతగా నున్నదియో చూచి తివా? మన చావడికిఁ గ్రొత్త అందము తెచ్చుచున్నది. యొక బాల విటుఁడు దీనిం గానుకగాఁ దీసికొనివచ్చెను వాని నీ రాత్రి రమ్మ౦టి నింతలో నాకు వేడివచ్చినది బాధకుఁ దాళ లేకున్నదాన నీవొక యుపకారము సేయవలయును వినుము. వాఁడు కుర్రవాఁడు మీసకళయైన బాగుగరాలేదు. మాటలచేతనైన సంతోష పెట్టవచ్చును ఈరాత్రి వానినిఁ బడకకు రమ్మంటి రెండుగడియలెట్లో వానితో ముచ్చటలాడి సాగ నంపుము. నీవుమాత్రమాడుదానవుగావా ? మంచి వస్తువు దక్కఁగలదు ! ఈమాత్ర ముపకారము జేయుమని బ్రతిమాలినది.

పద్మినికా తివాసిచూచినతోడనే పూర్వపుస్మృతి యంతయుం గలిగినది. ఆ యల్లికచూచి యోహో ? యిది నాభర్త అల్లియుండవలయును. మాకుఁగాక యొరు లకీ పనిరాదు. ఇది తెచ్చిన పిల్లవాఁడెవ్వడో తెలిసికొని వానిమూలమున నాభర్త