పుట:కాశీమజిలీకథలు -07.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

కాశీమజిలీకథలు - సప్తమభాగము


126 వ మజిలీ.

మృగదత్తుని కథ

గురుదత్తుఁడునుఁ బద్మినియు వసించిన కోయపల్లెకు నాలుగు క్రోశముల దూరములో మఱియొక కొండపల్లెగలదు. అందును గోయలు, చెంచులు బోయెలు, లోనగు నడవిజాతివారు కాపురముచేయుచున్నారు. వారును జాపలు, బుట్టలు, తట్టలు, మొదలగు నుపకరణములల్లి గ్రామములమీదికిఁ దీసికొనిపోయి యమ్ముచుందురు.

పద్మిని యల్లిన వస్తువులు కతంబునఁ గోయపల్లి లోని వారందఱికి భాగ్యము గలుగుటఁ దెలిసికొని యందలి పెద్దలు గుమిగూడి యొకనాఁడు అయ్యో? కోయ పల్లెవాండ్రందరు వింతచాపలు, బుట్టలునల్లుచుండిరి. మన కాపని తెలిసినదికాదు. మనమేడాది యల్లిన వస్తువుల కెల్ల వచ్చిన వెల వారొక తివాసినమ్మి తెచ్చు చున్నారు. వాండ్రా పని నెక్కడనేర్చుకొనిరో తెలిసికొనవలయు మనముగూడ నేర్చు కొందమని తలంచి యాలోచింపుచుండ వారిలోనొక కిరాతకుమారుఁడు పదమూఁడే డుల ప్రాయముగలవాఁడు ముందరకువచ్చి నాకావస్తువులఁ జూపుఁడు నేనల్లెదనని చెప్పెను.

ఆమాటలు విని కొందఱప్పుడే యాపల్లెకుఁబోయి చుట్టముల యొద్దనున్న వింతవస్తువులఁ గొన్ని తెచ్చి వానికింజూపిరి. బుద్ధిమంతుఁడగు నాబాలుఁడు వానిని విప్పి మరల నల్లి అందలి మర్మముల గ్రహించి యాయాకులఁ దెప్పించి తానుగూడ నాయుపకరణముల నల్లుచుండెను. వానిపేరు చిరుతపులి పలిపులిఅని అందరు వానిం బిలుచుచుందురు. ఆచిరుతపులి యొకనాఁ డల్లిన చాపలును, బుట్టలును మఱియొకనాడ ల్లుటలేదు. అంతకన్నజాలవిన్నాణముగా నల్లుచుండును. సంవత్సరములో నాపని యందాబాలుని కనన్యసామాన్యమైన నైపుణ్యముగలిగినది. గురుదత్తుఁడు పద్మిని అల్లి నవి వాఁడల్లిన వానిముందఱఁ జాలతేలికగాఁ గనంబడుచుండెను. ఆపని యందరిబాలు రకు నేరుపయత్నించెను. కాని యొక్కనికి నాపద్ధతియే దెలిసినదికాదు. వాడుకగా నల్లు చుండు తాడియాకులు, నీతాకులు, ఖర్జూరపాకులు లోనగు నాకులతోఁ నల్లె డుచాపలు మాత్రమే వాండ్రు అల్లుచుందురు.

పిట్టరెక్కలుతోను, వింతమేకబొచ్చుతోను, మృదుదళములతోను తివాసులను గొన్నిటినల్లి వానికి మిక్కిలి వెలవచ్చునని తలంచి తండ్రినడిగి కోయపిల్లవాండ్రు సహాయముగా గాడిదలపై వానిని మఱికొన్ని యుపకరణముల నెక్కించి చిరుతపులి యొకనాఁడు ఉదయార్కుఁడను మహారాజుచేతఁ బాలింపఁబడుచున్న యర్యమపురంబున