పుట:కాశీమజిలీకథలు -07.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మిని కథ

181

చిక్కి మలినయై వికృతముగా నుండుటచేఁ బద్మిని సౌందర్యము సామాన్యు లకుఁ దేటగాదుకాని నిదానించి చూచిన బుద్దిమంతులకుఁ దెలియఁబడకమానదు. రత్నాంగి పద్మినింజూచి రూపమునకు వెరగుపడుచుఁ దాపునకుజీరి, అమ్మీ ! నీదే యూరు? ఎవ్వరికొఱకిటు పలుమారు తిరుగుచుంటివి. నీ పేరేమి ? నాకొక యుప కారము చేసి పెట్టెదవా ? తప్పుగా గణింపకుమీ ? ఈ కడవతోఁ గడివెడునీళ్ళు తెచ్చి పెట్టెదవేని నీయుపకారము మరువను. అదియే తటాకము. మేము స్వయముగాఁ దెచ్చికొనిన మాకులములో వెలవేయుదురు. అని కడవ నందిచ్చుచు బ్రతిమాలికొన్నది. పద్మిని సహజముగాఁ బరోపకార పరురాలగుట విని ప్రతివచన మేమియు నీయకయే కడవగైకొని తటాకమునకుబోయి స్నానముచేసి కడవతో నీళ్ళుతెచ్చి అమ్మా ! యెక్కడఁ బోయుదును చెప్పుమనుటయు నది తొందరపడుచు సంతస మభినయించి యింటనున్న బిందెలు సద్ది వీనిలోఁబోయుమని చెప్పినది.

విసుగులేక పదికడవలనీళ్ళు తెచ్చి గంగాళములు నిండించినది . దొడ్డిలోని చెట్లకుఁ బోసినది. పలుమారు స్నానముచేసినది. రత్నాంగి యామెను వెఱ్రిదానిగా గ్రహించి అమ్మీ ! నీకుఁ గూడును గుడ్డయు నిచ్చెదను. మాయింట నేపనియుఁ జేయనక్కరలేదు. అనుదినము పది బిందెలు నీళ్ళు తెచ్చి పెట్టెదవా యని యడిగిన నట్లే తెచ్చెదనని తల ద్రిప్పినది.

రత్నాంగి యట్టి పనికత్తెకొఱకు చాల యిబ్బంది పడుచున్నది. కావున నప్పుడు మిగుల సంతసి౦చుచు నామెకుఁ గట్టుకొన మంచిపుట్టములిచ్చి భొజనము పెట్టి పోషించుచుండెను.

పద్మిని పూర్వపుస్మృతిలేక యున్మత్తవికారముతోనే రత్నాంగి మెచ్చునట్లు పనులుచేయుచుఁ గొంతకాలము దానియింటిలోనుండెను. అప్పుడప్పుడు తెలివివచ్చి తన వృత్తాంతము దెలిసికొని దుఃఖించుచు మరణింపవలయునని నిశ్చయించుకొను చుండును. కాని యంతలో నా మాట మరచిపోవుటచే యధాప్రకారము పనికత్తెయై పనులు చేయుచుండెను పాండవులంతవారిని బానిసలనుజేసినవిధి పద్మిని నొక వారాంగనకుఁ బనికత్తెగాఁ జేయుట యబ్బురము గాదు.


మ. ఎట నెవ్వానికి నెన్ని రేల్సుఖముగా * నీ దుఃఖమున్‌ గానివి
     స్ఫుట పూర్వా చరితాత్మకర్మవశతన్‌ * భోక్తవ్యమైయుండునో
     ఘటనాచాతురిఁ ద్రాళ్ళగట్టుచు బలా * త్కారంబుగా వానిన
     చ్చోటికిందోడ్కొనివచ్చి దా నిగుడిపిం * చున్‌దైవమన్నాళ్లొగిన్‌

     అని యెఱింగించి.