పుట:కాశీమజిలీకథలు -07.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ముతో బద్మినింజూచి చింతించుచు నామెయడుగ అమ్మా ! నీభర్తసకృ దష్టుండగుట విని మందువేరులకై తలయొకదెసకుఁబోయితిమి. మందులందీసికొనిపోయినంత నతండా చెట్టుక్రిందలేడు. అడవియేఁనుగు పాదములచిహ్నములు గనంబడినవి అవి మనుష్యుల నమాంతముగా నెత్తికొనిపోఁగలవు వివశుండగు నతని నాయేనుఁగుదీసు కొనిపోయినది. తల్లీ ! మేమేమియు జేయలేక పోయితిమని దుఃఖింపఁదొడంగిరి.

ఆమాటలవినియా బోఁటియూహచెడినేలంబడి అడలుచుండుటయు నెఱుఁగదు పిచ్చిమాట లాడఁదొడంగినది కొంతసేపు వింతవింతగాఁ జూచుచుండెను. చెంచెతలు మంచిమాటలనూరడించుచు అమ్మా ! నీమగని కేమియు భయములేదు. ఏనుఁగనెక్కి రాఁగలఁడు. నీయొడలు పచ్చిది దుఃఖించినఁ జెడకమానదు మానుము మానుము అని బ్రతిమాలుచుండిరి. వారిమాటలు పద్మినికి వినఁబడవు విపరీతముగా నుత్తరములు చెప్పుచుండును. పూర్వమువలె వారితో మాట్లాడదు పనులుచేయదు. అభి మానంబునఁ బద్యపానములిచ్చి కొన్నిదినంబులామెకు బరిచర్య చేసిరికాని క్రమంబున నామెకు వెర్రియెక్కువైనకొలఁది తప్పుకొని తిరుగుచుండిరి. అమె కుడు చుటయుఁ గట్టుటయు నెరుఁగదు. వెఱ్ఱిదానివలె మాట్లాడుచుఁ గొన్ని నెలలా పల్లెలో నుండెను ఆమె స్వయముగా వండికొనితినుట యెరుఁగదు. ఎవ్వరయినఁ బిలిచి తిను మనినఁ దినును. లేకున్న నుపవాసమేచేయుచుండును. గురుదత్తుని జాడయేమియుఁ దెలియక అతండు చచ్చెనుకా నిశ్చయించి బోయలు పద్మిని నంతగా విమర్శింప మానివేసిరి.

పద్మినియు దన్ను మన్నించువారు లేమంజేసి యొకనాఁ డొక అరణ్యమార్గం బునంబడి నడువసాగెను. పులులకు వెరవదు. చీకటికి జడియదు. ఎండకుజంకదు, వానకు భయపడదు ఆహారసుఖము కోరదు. ఆకులలములు తిని యాకలి యడంచు కొనఁగలదు.

నడుమనడుమ తెలివివచ్చివప్పుడు మనోహరా ? గురుదత్తా నాకీజన్మమునకుఁ గనంబడవా ? ఇప్పుడేవత్తునని పోయితివే యెందైనం దాగితివా ? అని పలుకుచు పెద్దయెలుంగున నోగురుదత్తా ! అని పిలుచుచుండును. ఈరీతిఁ గొంతకాల మున్మ త్తవ్యాపారమున నయ్యడవుల సంచరించి యేబాథం బొరయక యొకనాఁడు ప్రాతః కాలమున కొక పట్టణము జేరినది. అప్పటికిగొంచెము ప్రొద్దెక్కినది. పద్మిని పిచ్చివేషములతో నొక వీధింబడి పోవుచుండెను.

ఆవీధిని రత్నాంగి యను బోగముది తనయింటిముంగల నిలువబడి నీళ్ళుతెచ్చు పనిక త్తెకై యెదురుచూచుచుండెను. ఎప్పటికినిఁబనికత్తె వచ్చినది కాదు. పద్మిని కొక‌ గమ్యస్థానము లేమింజేసి యావీధినిటు నటు మూడుసారులు తిరిగినది.