పుట:కాశీమజిలీకథలు -07.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22]

గోమిని కథ

169

గోమినీ ! నేననుకొనుట కాదుగాని నారూపము, నారసికత, నాయౌవనము జూచిన యువతి రసికురాలైనచో విరాళిఁజెందకుండునా! సరే కానిమ్ము ఎప్పుడు రమ్మన్నది మనపరుషోక్తులు వినలేదుగద అని యడిగిన నది స్వామీ ! చెప్పియుం జెప్పనట్లభినయించితిని నాలుగు దినములఱుగవలయునని యీవృత్తాంత మెఱింగించి నది.

మఱియు నిరూపింపఁబడిన దివసంబున గోమిని పద్మిని యింటికి వెళ్ళి మాట్లాడివచ్చి రాజుతో నిట్లనియె.

దేవా! యెల్లుండి యమవసనాఁడు రాత్రి పెరిటివైపుననున్న పశువులశాలలోనికి రమ్మన్నది. తలుపుతీసియుంచునఁట. అందుమంచము వైచునఁట ఒకరాత్రి యెట్లో కష్టపడిన దివ్యసుఖం బనుభవింపవచ్చునని చెప్పినది దీపములేని లోపము మున్ముందు తీర్చఁగలదట చాలాప్రీతిగా మాట్లాడినది అని చెప్పిన విని రాజు కానిమ్ము. ఒక్క రేయిగదా? యెట్లో కష్టపడియెదను ఒకసారి కలసిన వెంటఁబడి వచ్చునట్లు చేయనా? నాచాతుర్యము చూతువుగాక అనుచు నింకను అమవస మూడుదినములున్నదే, ఈ కాలవ్యవధి యెట్లు సహింతునో తెలియదు. ఈకష్టమంతయు దానికెప్పుడు విన్న వించెదనో, ఎప్పుడది పశ్చాత్తాపపడునో అని యుఱ్ఱూతలూగు చిత్తముతో గడియలు లెక్క పెట్టుచుండెను. నాలుగవదినంబునఁ బద్మిని దూదికతో మాట్లాడిన విషయంబు లన్నియును గురుదత్తుఁడు చెవియొగ్లి విని దారుణవిషాద మేదురహృదయుండై ఛీ! ఛీ! ఆడుజాతికి గుణముండదన్నమాట సత్యము కొక్కోకుఁడేకాక. వాత్సాయనాది మహర్షులును పద్మినీజాతియువతి యత్తమురాలని వ్రాసిరి అది సౌందర్యవిషయము గాని గుణవిషయము గాదు. స్త్రీలలోఁ బ్రతివ్రతయేలేదని చాటిచెప్పఁగలను. అన్నన్నా ! పద్మిని నాయెడజూపు నక్కవినయములునమ్మి ప్రాణపదముగాఁజూచు కొంటిని అక్కటా ! యిట్టిదే యిట్టి తుచ్చకృత్యములకు బాల్పడుచుండఁ దక్కిన వారిమాట చెప్పనేల? కానిమ్ము. అమావాస్యచర్యఁజూచి వారిద్ధరికి నామంచముమీఁదనే కడతేర్చి యింటికిఁ బోయెదనని నిశ్చయించి కత్తినూరుచుండెను.

అమావాస్యనాఁడు తెల్లవారినది మొదలు సురూపుఁడు గడియలు లెక్క పెట్టు చుండెను. పర్వదివసంబై నను క్షురకృత్యము జేయించి మీసములు దిద్దించెను. పన్నీట జలకమాడెను. అద్దము జూచుచుఁ గనుబొమ లెగురవైచుచు గోమినిం జీరి యోసీ? సూర్యరథ గమనము నేడింత మందమైనదేమి? యెంత సేపటికి ప్రొద్దు క్రుంకకున్నదే నాకే దుస్తులు సొంపుగా నుండునో చెప్పుము. అని పలుకుచుఁ బది దినుసుల నగలును, దుస్తులు ధరించి విడిచి యడుగుచుండును.