పుట:కాశీమజిలీకథలు -07.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

కాశీమజిలీకథలు - సప్తమభాగము

గోమినియు దేనికదియే చక్కగా నున్నదని రాజును స్తుతియింపఁ దొడంగి నది. ప్రొద్దు క్రుంకినది. ఇఁక బయలు దేరుదుమా? అనుటయు నది నవ్వుచు దేవా! రాత్రి పండ్రెండు గంటలుగొట్టిన నిమిషమున నందుండవలయును. ఈలోపలఁ బోయినను, దలుపుతీయదు. వీధినిలువంబడిన నొరులుచూచి శంకింతురు. తాళుము తాళుము జాము సేపు తాళుము అని చెప్పుచుండెను.

రాజు గంటగంటకు నడుగుచునే యుండెను. పది గంటలుగొట్టినతోడనే యతనిమేనఁ గంపము జనించినది. ఇఁక నిలువలేను పదపద అని తొందర పెట్టుచు నుద్యానవనమునుండి బయలుదేరెను. రాజు గోమిని ముందుదారిఁ జూపుచుండ నీలాం బరము. మేలిముసుఁగు వైచికొని మెల్లగా నడచుచు నొరులు కనంబడిన ప్పుడు పెడకొసరిల్లుచుఁ గొంతవడికిఁ గుముదాంగదుని పెరటిగుమ్మము దాపునకుఁ బోయెను.

గోమిని ముందుగాఁబోయి తలుపు గొణ్ణెము లేక యోరగా వైచియుండుటకు సంతసించుచు లోపలికిఁబోయి చీకటిలోఁ దడిమికొనుచు మంచమున్న తావరసి చేఁతితోమంచమునుఁదట్టి మరల నీవలకువచ్చిరాజు చేయిపట్టుకొని లోపలి కిదీసికొనిపోయి మంచముపైఁ గూర్చుండఁబెట్టి నేను వాకిటనుండెద నాపడఁతి యిప్పుడే రాఁగలదని మెల్లగాఁ జెప్పి తలుపు చేరవైచి గుమ్మములోఁ గూర్చుండెను.

గురుదత్తుండు అమావాస్యనాఁడు రాత్రి ప్రొద్దుపోయిన తరువాతఁ బశువుల చావడిలోనికిఁ బోయి తలుపుగొణ్ణెము వైవకుండుటయు, మంచముపరువఁబడియుండు టయుఁ దిలకించి పద్మిని నిక్కముగా దుర్వృత్తికిఁ బూనుకొనెనని నిశ్చయించి నూరిన కత్తి మంచముప్రక్క నిడుకొని వాఁడు కపటనిద్రఁబోవఁదొడంగెను.

పద్మిని మనోహరుని గుఱ్ఱువిని మెల్లగలేచి యొక కాగితము దీసికొని దీపము వెలుగున నిలువంబడి యిట్లు వ్రాసినది.

ఓమహాజనులారా ! ఈరాజు పరస్త్రీలోలుండై మంచిచెడ్డల విచారింపక నన్నుఁజూచి మోహించి నాతల్లి దండ్రులఁ జుట్టములను నిర్బంధించి చెరసాలఁ బెట్టించి నన్ను బలాత్కారముగాఁ దీసికొనిపోయెదనని దూతికాముఖంబునఁ దెలియఁజేసి యున్నవాఁడు. బంధు పరిభవమునకును మానహానికినివెరచి యొండు తెరవుగానక యొడంబడినట్లభినయించుచు నేఁటిరాత్రి మాయింటికి రమ్మని సాంకేతిక మేర్పరచితిని. యిప్పుడీ దుష్టాత్ముని నాకౌక్షేయకంబునకుఁ బలియిచ్చి‌ మదీయపాతి వ్రత్యము గాపాడుకొంటిని ఇట్టి పాపాత్ముఁడు రాజుగా నుండుటకంటె బ్రజలకు మఱియొక యపకారములేదు. మఱియు నీ ద్రోహుని మూలమున సత్యసంధుండును