పుట:కాశీమజిలీకథలు -07.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అప్పుడా గోమిని సిగ్గుపడి యేమిచేయుటకుం దోచక యొక్కింత తడవు ధ్యానించి యావస్తువులందే యుంచి క్రమ్మరి అమ్మనుజపతియొద్దకుఁ బోయినది.

అతండు పదియడుగు లెదురువచ్చి చేయిపట్టుకొని యేమి జరిగినది ? అను కూలపడినదియా ? నీబుద్దిబలమునకు లోఁబడని వారుందురా ? అక్కటా ? నీయాగ మనావకాశ సమయము యుగాంతరములట్లు తోచినదికదా ? అని యాతురతతో అడిగిన నది యించుక దిగులుదోపనాపతికిట్లనియె.

దేవా ? ఆపూవుఁబోణి సామాన్యురాలుగాదు అభిలాషయున్నను దెప్పున హృదయమిచ్చినది కాదు గంభీరురాలు. స్త్రీ చిత్తము దెలిసికొనుట కడుంగడు కష్టముగదా? మీ గుణంబులు పొగడితిని. మీ రూపము వర్ణించితిని మీసరసత్వము గొనియాడితిని అన్నింటి కన్నియు వంకలే పెట్టినది కానిండు. అని నిట్టూర్పు నిగుడించిన గుండె ఝల్లుమన అమ్మనుజవల్లభుం డిట్లనియె.

గోమినీ ? నీవిట్లు తెల తెల్లపోవుచుంటివేమి ? చూచి మాటాడితివా ? యేమ న్నది అచ్చముగా నామాటలం జెప్పుమనుటయు అది జరిగిన కథయంతయుం జెప్పి నది. ఱేడు చింతించుచుండఁ దొందరపడవలదు. స్త్రీ చిత్తము క్షణమున కొకరీతి నుండును. కార్యము సాధించెదనని రాజును సమాధానపరచి పెక్కునెపములు పన్ని వారింటికి బలుమారు పోయినది కానీ పద్మిని దానిమాటలకు లోబడినదికాదు.

కొసకు వేసరి యాదాసరిది రాజునొద్దకువచ్చి దేవా ! నేనును భూమండల మంతయుం జూచితిని. కాని యిట్టి జంత నిట్టిరాగ, నిట్టిజాణ నిట్టివలంతి, నిట్టిగరాసు, నిటిప్రోఢ నెందును జూచి యెఱుంగ ఏమన్న నుఁదప్పుగా గణించి శ్లోకములు చదు వును మనకు నీతి యుపదేశించును. పెక్కేల దేవరనడవడి బాగులేదని యాక్షేపించి నది ఇఁక దానితో నెట్లు మాట్లాడుదునని చెప్పినంత యుగాంతవలాహకంబు పగిది గర్జిల్లుచు నేమీ ? యామోటుకొలముది మాకునుం దప్పలుపట్టినదిగా ? తన్ను వరించినందులకు అనుగ్రహముగాఁ దలంపక గరువముచే వెక్కిరించుచున్నదియా ? చాలుఁ జాలు. స్త్రీలు సామమునఁ జక్కఁబడరు. లోకాపవాదమునకు వెరచి యిన్ని నాళ్ళోర్చితిని. ఇఁక కాచికొనుమనుము నాక పటి సందేశ మెఱింగించి రమ్ము.

సామమున మాయేలికతోఁ గూడినఁ దోడిచేడియలలో నుత్తమురాలవై సామ్రాజ్య సౌఖ్యమనుభవింపఁగలవు. లేనిచో నిన్ను బలాత్కారముగానైననుఁ బరిభ వింపక మానఁడు నీభర్తనుఁ దల్లిదండ్రులను జెరఁబెట్టి సంపదయంతయు లాగికొ నును. పిమ్మట నీకడ్డుపడువారెవ్వరో చూతముగాక. అని నిర్భయముగాఁ జెప్పి రమ్ము. పొమ్మని పలికి ఆతండు. దానినంపెను.