పుట:కాశీమజిలీకథలు -07.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోమిని కథ

165


124 వ మజిలీ.

గోమిని కథ

అమ్మ ! మొన్న రాజుగారితో వచ్చిన గోమిని‌ అను నామె ద్వారమున నిలువం బడియున్నది మీతో ముచ్చటింప వచ్చినదఁట. అయ్యగారు లోపలికిఁ దీసికొని పొమ్మని చెప్పినారు. తీసికొనిరానా అని పరిచారిక పద్మిని నడిగినది. పద్మిని యించుక యాలోచించి అయ్యగారు సెలవిచ్చిరా ? అగును. రాజుగారిచుట్టముకాదా? రమ్మనుమని పలికినంత నదివోయి గోమినిం దీసికొనివచ్చినది.

పద్మిని దానిం గూర్చుండ నియమించినది. అదియు నమస్కరించి కూర్చుండి తానుదెచ్చిన కానుకలు ముందిడి యువతీ ! నీ అదృష్టము మాబోఁటులు కొనియాడఁ జాలరు. రూపమా! త్రిభువనజనమోహజనకము. ప్రాయమా మొదటిది బుద్దియా బృహస్పతికి వంకలు పెట్టఁగలుగునంతకటిది. విద్యలకు సరస్వతివే ధనముచే కుబేరున కప్పు పెట్టఁగలరు. ఇన్నిలక్షణము లొకచోట పట్టుట. దుర్ఘటముగదా? ఈ పట్టణమేలెడు మహారాజుభార్యకు నీగుణములలో శతాంశమైనలేదు. వట్టియెడ్డిది? యేమియుం దెలియదు. మారాజునకు సరిపడినది కాదు. రాజుమాత్రము నవరస రసికుఁడు మంచి రూపముగలవాఁడు దైవము తగినవారికిఁ దగినభార్య నీయఁడుగదా? నీవాలభ్య మనుకూలమగునా? మారాజు నీవిఖ్యాతి విని మిగుల నానందించుచున్నాఁడు. పాండిత్యముగల స్ర్రీలచరిత్రము వినిన మనరాజునకుఁ బెద్దసంతోషము. ఈ పూవులు ఫలములు నీకుఁ గానుకగా నిచ్చెను. ఈపుట్టంబులు నీకుఁ గట్టఁబంపెను. మొన్న మీయింటికి వచ్చినది మొదలు మీయందు స్నేహభావము గలిగియుండెను. అని కడు నై పుణ్యముగాఁ బలుకుచుఁ దానుదెచ్చిన వస్తువులు ముంగలఁబెట్టినది.

పద్మిని వానిం జూడక మొగమున నించుక అలుక జనింప గోమినీ ? నీదూతికాకృత్యములు నాయొద్దఁ బ్రకటింపకుము. నీస్తోత్రపాఠములకు నేను బుబదానను గాను రాజు‌ రసికుండగుటయు స్త్రీవిద్యాలాలసుండగుటయు రాజ్యతంత్రమునకు ముఖ్యాంగములు గావు. ధర్మబుద్ధిఁగలిగి ప్రజల బిడ్డలగాఁ జూచుచు దుష్ట శిక్షణంబు శిష్టరక్షణంబు సేయుట రాజధర్మము. దుర్వ్యసనాసక్తుండగు రాజు సిరి వేషవిని మడువువలె క్షీణించును. నాగుణంబు లతండు వినుతించుటకుఁ గతంబులేదు. నాకీ కానుకలంపుట భావ్యముగాదు సన్నతం డెట్లెఱుంగును. సంసారి స్త్రీ చరిత్రతో అతని కేమిపనియున్నది నాచక్కఁదనము ప్రశంసింప అతనికేమి యక్కర నాకీ కానుక లక్కరలేదు. తీసికొనిపొమ్ము ఇట్టి మాట లెన్నఁడును నాయొద్ద జెప్పకుమని పలు కుచు నాకలికి అందు నిలువక అవ్వలికిం బోయినది.