పుట:కాశీమజిలీకథలు -07.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

కాశీమజిలీకథలు - సప్తమభాగము

సంభ్రమముతో అయ్యో ! ఆ మాటయె మరచితిమి గోమినీ ! ఈతండు మాకు ముఖ్య స్నేహితుండు వీరి సంపదల కానందించితిమి సౌధము నా స్వాంతము నకు వింతగొలిపినది. చూచి వత్తము రమ్మని పలుకుచు నప్పుడే యశ్వశకటము దెప్పించి వర్తకునిఁ బ్రక్కనిడుకొని గోమిని వెనుక నిలువ నతివేగముగాఁ గుముదాంగ దుని యింటికరిగెను. అలంకార శోభితమైనను రాజు చూచునని యా వర్తకుఁడు మేడను గొత్తగా నలంకరించెను.

బండి దిగిన వెంటనే వర్తకుఁడు రాజునకుఁ గైదండ యొసంగి అల్లన యింటిలోనికిఁ దీసికొనిపోయెను. గోమిని వెంటనంటిరా నా అంతరము లన్నియుఁ జూచుచు మెచ్చుకొనుచుఁ బద్మిని గనంబడునేమో అని నలుమూలలు తొంగి తొంగి చూచుచుండెను. తిరిగి తిరిగి‌ యెందును నాసుందరిం గానక యొక చావడిలోఁ గూర్చుండి రుక్మాంగదునితో సెట్టీ ? నీకుఁ బిల్ల లెందరని యోగక్షేమమడుగుటయు నతం డిట్లనియె.

దేవా ! నాకు లేక లేక యొక్కరితయే కూఁతురు గలిగినది. పురుషసంతతి లేదు. కుంభీనసపుర వాస్త వ్యుఁడగు రత్నాకరుఁడను వైశ్యపుత్రుఁడు గురుదత్తుఁడను వానికిచ్చితిని. అల్లుడు మా యింటనే యున్నవాఁడని పలుకుచుఁ బరిజనునంపి అతని రప్పించెను.

గురుదత్తునిఁజూచి రాజు లోపలవిస్మయముజెందచు నోహో? నీఅదృష్టము మంచిది మంచి అల్లుడే అని పలికెను. దేవా ! యీతనికి సిరిచాలగలదు. విద్యలలోఁ బ్రసిద్దిపడినవాఁడు మిక్కిలి విన్నాణి అని చెప్పగా నట్లయిన నిందూరకుండనేల? మన యాస్థానమునకు రమ్మనుము. వేతన మేర్చరచెదను. పండితగోష్ఠి నృపునకు నవశ్యకరణీయముగదా అని పలికెను.

ఆమాటలేమియు వినుపించుకొనక గురుదత్తుండు కొంతతడవందుండి అంతలో నేదియో పనికల్పించుకొని అవ్వలికిఁ బోయెను. పెద్దతడ వున్నను బద్మిని గనం బడమిఁ జింతించుచు రాజు మఱల మఱల నరల శోధించి శోధించి పరితపించచుఁ గొంత సేపటి కింటికింబోయెను. గోమినికినిఁ బద్మినిం జూచు నుపాయమేదియుం దోచి నదికాదు. కావున రాజుతో నఱిగినది. అని యెఱింగించువరకు