పుట:కాశీమజిలీకథలు -07.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సురూపుని కథ

163

దేవా ! దాని చరిత్ర మిదివఱకు నేనెఱింగినదియే ? అది యుత్తమ జాతి యువతి. నేను పెక్కుసారులు శోత్రియ వేషముతో వారింటికేగితిని. పల్కరించి చూచితిని. మోమెత్తి చూడదు. ముఖవిలాసము లరయవలయునని యెంతయో ప్రయ త్నించితిని. ఇంచుకయు నవకాశ మిచ్చినది కాదు. సంతతము దేవతాతిధిసత్కార ములు జేయుచుండును. విద్యలలో సరస్వతిని మించినది ఆ బోటితో నవకాశమిచ్చి నను మా బోటులు మాటాడఁగలరా ? అసాధ్యమని తలంచియే యక్కాంత వృత్తాం తము దేవరకెఱింగించితిని కాను. అని చెప్పిన విని యన్నరపతి గోమినిని రప్పించి యిట్లనియె.

గోమినీ ! కరటుండు మనయెడ కపటము చేయుచున్నవాఁడు పద్మిని మహా పతివ్రతయట కన్నెత్తి యెవ్వనిఁజూడదఁట. స్త్రీలటక్కులు స్త్రీలకేకాక యొరులకుఁ దెలియవుగదా ! పద్మినివశవర్తింజేసి వీని నోడించితివేని నీకు లక్షరూప్యములఁ గాను కగా నిచ్చెద నేమనియెదవని యడిగిన నది మూపులెగరవైచుచు నిట్టనియె.

దేవా ! యిది యెంతపని కాలవిలంబము సైచితిరేని నరుంధతివంటి వాల్గంటి నైననుఁ బుంశ్చలిం జేయగలను. ఈ వైశ్యపుత్రిక మాట లెక్కయేల ? ఏదో కైత వంబున మీరొకసారి యానారీరత్నము కన్నులంబడి‌ రండు తరువాత మీగుణ గణంబుల బొగడి తానంతవచ్చి మిమ్ముసేవించునట్లు చేసెద నామాయలఁ బడని పడఁతి గలదా యని పలికిన విని రాజుమిగుల సంతోషించెను. కరటుండు నవ్వుచు కపటకృత్యముల నీవాసతీ తిలకమును వశవర్తినిం జేసితివేని సిఖాయజ్ఞోపవీతములఁ దీసి సన్యాసినయ్యెద నిదియే నాశపధము.


కం. లంజ పడంతుల కడనే
     రంజించు న్నీదువాక్యరచనలు మఱిసా
     గంజెల్ల వామె కడపద
     భజించు నిన్ను వామ పదవాతిఁబలుకన్‌.

నీమాయాడాంబికా డంబరములా కంబుకంఠికడ నుపయోగింపవని యెత్తి పలి కిన గోమినియు నామత్తకాశినిం దెత్తునని పెద్ద శపధము జేసినది. అక్కారణంబున వారిద్దరికి బెద్ద కలహము జరుగుటయు రాజు గోమినిపక్షముగా మాట్లాడుచు గరుటుని మందలించెను. ఇంతలోఁ గుముదాంగదుండు దర్శనార్థియై వచ్చెనని‌ ద్వారపాలుండు వచ్చి చెప్పినంత నయ్యనంతాకాంతుఁడు సంతోషముతో నెదురేగి పాణీఁబాణింబీడిం చుచు సుఖాసనాపవిష్ణుంజేసి యెఱుంగనివాడుంబోలె నాగమనకారణం బడుగుటయు ధనగణకుఁడు దేవా? రాతిరి సెలవిచ్చిన మాటమరచితిరా ? నేఁటి సాయంకాలము మాయింటికిఁ దయచేయుదుమని చెప్పలేదా ? పిలువ వచ్చితినని పలికెను.