పుట:కాశీమజిలీకథలు -07.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

కాశీమజిలీకథలు - సప్తమభాగము

సౌధంబుమ్రోల నుత్సవము నిలిపి రాజు గురుతుగా నామేడఁ జూచుచుండ నామేడలో నుండి మబ్బు వెల్వడిన మెఱపుతీగియంబోలి మానినీరత్నం బొకర్తుక తలుపులు తెఱచుకొని పీతాంబరధారిణియై మోడ్పుకేలుతో స్వామిని స్తుతించుచు ద్వారమున నిలువంబడినది. దీపముల వెలుఁగున ఢగద్దగాయమానంబులగు నాభరణ కాంతులు మిఱుమిట్లు గొలుప అద్భుత లావణ్య పరిపూర్ణయై ప్రకాశించు అక్కాంచన గాత్రి మోముపలక్షించి రాజు తడఁబడు పలుకులచే అదిగో అదియే మదీయ హృదయచోర కురాలు అని ముమ్మారు పలికి మోహవివశుండయ్యెను.

అప్పుడు గోమిని యేనుఁగును దిగి తదీయ కులశీలాదులఁ దెలిసికొనివచ్చి నృపతిని బ్రబోధితుంజేసి యిట్లనియె. దేవా ! యీ మేడ విత్తగణకుఁడు (షరాబు) కుముదాంగదునిది. ఆమదవతి అతని కూఁతురు. పేరు పద్మినియఁట. మంచి చక్కనిది. మీరు వరింపఁదగినదియేయని పొగడినది.

రాజు విస్మయ మభినయించుచుఁ బెద్దతడనందునిలిచి అక్కలికి సోయగ మాపోవని చూడ్కు.ల నరయుచుండెను. పద్మిని స్వామికి నివాళియిచ్చి స్తుతియించి ప్రసాదము గైకొని యందు నిలువక మేళ తాళములు చూడక లోపలికిం బోయి నది.

అప్పుడు రాజు కుముదాంగదుని రప్పించి గౌరవించుచు సెట్టి యీ మేడ నీదఁటకాదా ?. బహురమణీయముగా నున్నదే? మాకెప్పుడును జూపితివికావేమి ? అని యడిగిన అతండు చిత్తము చిత్తము మా పూర్వులు గట్టినది. దివాణపుదయ వలనం గలిగినదియే మేముతమజనముకామా ! లోనికి దయచేయుఁడు అని వినయం బునఁ బ్రార్దించుటయు నారేఁడు ఇప్పుడు ప్రొద్దుపోయినది రేపు జ్ఞాపకము చేయుము. సౌయంకాలమున వచ్చి చూచెదంగాక‌ ? మా పరిజనముల సంపదలు మాకు సమ్మోద జనకములు అని పలికీ అతని నంపి యా యుత్సవముతోఁ గొంత దూరము పోయి నిద్రకు నిలువలేనని యింటికిం బోయెను.

మరునాఁడు కరటుని రప్పించి విప్రకుమారా! నీవు శృంగార లీలాతరంగిత ములై గ్రంధములు పెక్కు చదివితివి. కామశాస్త్రమంతయు నీకుఁ గంఠస్థమై యున్నదిగదా ! వాత్స్యాయనసూత్రములు నీకు సంధ్యావందనముకన్న గట్టిగా వచ్చును. రాత్రి నేను జూచిన చిన్నదానిచరిత్రము నీకుఁ జెప్పితినిగదా ? ఆవాల్గంటి వంటి వన్నెలాడి పుడమిలో నేనిదివరకుఁ జూచియుండలేదు. కోమటింట నట్టి సొగసు కత్తె పుట్టుట వింతగదా ? అక్కాంతనాచెంతకెప్పుడు తీసికొనివత్తువు ?.ఉపాయ మేమి ? నిమిషము యగములాగున్నది. విరహవేదన భరింపలేకున్నవాఁడనని పలి కిన విని యాబ్రాహ్మణపుత్రుం డిట్లనియె.