పుట:కాశీమజిలీకథలు -07.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

కాశీమజిలీకథలు - సప్తమభాగము

యువతి అతని కన్నులంబడిన గవయక విడువఁడు. గోమినియను దాడియుఁ గరటుండను పరిచారకుండును వానికిఁ దత్కృత్యంబులఁ బరమమిత్రులై తిరుగు చుందురు.

ఒకనాఁ డతండు డుద్యానవనంబునందలి క్రీడాసౌధంబునవసించి పండు వెన్నెలలు గన్నులపండువు సేయుచుండ గోమినిని రప్పించి విరహాతురత్వంబు ప్రకటింపుచు నిట్లనియె.

గోమినీ! నీవు నిత్యమును గ్రొత్తక్రొత్త పూవుఁబోండ్లం దీసికొనివచ్చి ముచ్చ టలుదీర నా కుత్సాహంబు గలుగఁజేయుచుంటివి. అబ్బా ! నేఁటిబాధ నేనెన్నఁడును పడియుండి యెఱుంగను. నామేను ముట్టిచూడుము. మండిపోవుచున్నది. ప్రతీకారము గావించి బ్రతికింపుము అని నిట్టూర్పులు నిగుడఁ బలికిన విని యాదూతిక యాతు రతతోనిట్లనియె.

అయ్యో ? దేవరకిట్టి బాధపడ నవసర మేమివచ్చినది? మీరు కోరిన యే నారీ మణి యనుమతింపదు? ఏయువతిం దలంచి మీరిట్టియవస్థవహించితిరి వేగమ యాగజ గామినిం బేర్కొనుఁడు. మీ పాదాక్రాంతురాలిం గావించెదను ఆమదవతి మిమ్ము నిరాకరించుట కరుంధతియా? సతియా? ఆవ్రతమెట్టిదో చూచెదంగాక యానతీయుఁ డని పలికిన విని యారాజకుమారుం డిట్ల నియె.

గోమినీ ! వినుము. నావలపంత వింతయైనది. ఆ కలకంఠికుల నాకులశీంబులు తెలియవు. మొన్నటి విజయదశమి యుత్సవమునాడు. రాతిరి పట్టపేనుఁగునెక్కి వెంకటేశ్వరుని రథముతో ముంగిల నూరేగుచుంటిని ఒక మేడయొద్ద నిలువంబడి బడియుండ నాయింటిలో నుండి యొక వాల్గంటి యీవలకు వచ్చి స్వామికి నివాళి యిచ్చినది.

కప్పుర హారతి వెలుతురున నా సుందరి మోము చక్కఁదనమెంతయుఁ గన్నులపండువు గావించినది. అయ్యారే! అలి కన్నులు గిన్నులుకావు. యువజన హృదయాకర్షకములగు మదనుని యంత్రమత్స్యములని తలంచెదను. ఆహా ? ఆచెక్కుల తళ్కు చూచితీరవలయును. వెయ్యేల? అయొయ్యారము, ఆనీటు, ఆవగలు, ఆబిం కము, ఆపొంకము, పుడమి పడఁతుల కెందును గలిగియం౦డుట చూడలేదు. అచ్చరలా మచ్చకంటికి దాస్యము సేయఁ బనికిరారు. అట్టి అందముగల సుందరి మనయూర నున్నదని యెన్నఁడును జెప్పితివి కావుగదా? నిత్యముపట్టణమంతయుఁ దిఱిగి చక్కనివారిని వెదకుచుంటినని చెప్పచుందువు. ఆరమణీమణింగాంచి పంచశరవిద్ధ హృదయుండనై మోహపరవశుండనై అంబారిపైఁ బడిపోయితిని. తరువత నేమి జరి గినదో నాకుఁ దెలియదు. ఇంటికి వచ్చిన పిమ్మట మెలకువవచ్చినది.