పుట:కాశీమజిలీకథలు -07.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అమృతపు సోనవలె నప్పలుకులు తనచెవులకు ముదము గలుగఁ జేయుటయు గురుదత్తుండు వికసితముఖారవిందుడై గదాధరు నుపలక్షించెను.

ఆసన్నగ్రహించి యాసన్నవర్తియగు గురుండు పద్మినీవరుండు రాగానుషం గుడై విశ్రమింపఁ బశ్చిమాచలనిలయంబు చేరుచున్నవాఁడు పద్మినీగురుండును వచ్చు వేళయైనది మీరెక్కడ కేగెదరు: ఇందే యుండవచ్చును అని పలుకుచు అతండు భాగ్యవిభవంబులు నడుగుచు వారిలో మచ్చటింపుచున్న సమయంబునఁ గుముదాం గదుఁ డోలగమునుండి యింటికివచ్చి అందున్న క్రొత్తవారింగాంచి వారెవ్వరిని యడు గుటకు సందేహించుచుండ నొజ్జలు వారి యుదంత మెఱింగించిరి.

రత్నాకరుని వాడుక వినియున్న వాఁడగుటఁ గుముదాంగదుఁడు గురుదత్తు నత్యంత గౌరవప్రతిపత్తి జూపుచు దానింటలేనితఱినరుదెంచుటచే నెఱుఁగమి నింటి లోనివారలు దగినమర్యాదజేయలేదని చెప్పఁబోవుచు గదాధరుండు కల రూ పెఱింగించి పెద్దగాఁ బద్మినిం బొగడెను. కముదాంగదుండు మిగులఁ జెలగుచు నాఱేయి నుపాధ్యా యునింటికి గదాధరుం గుడవఁబంపి తనయింటఁ గురుదత్తునకుఁ బెద్డగా విందు గావిం చెను.

అతఁడు రాత్రి భార్యతో రహస్యముగా నతని కులశీలరూపవిద్యాధనగౌర వంబు లుగ్గడించుచుఁ బద్మిని నతనికి వివాహము చేయుదమా ! అని యాలోచించి కుమారి యభిప్రాయము తెలిసికొమ్మని నియమించుటయు ఆమె నవ్వుచు నిదివరకే దాని మానసంబు వానిపై వ్యాపించినది. దాది చెప్పినదని నుడువుటయు నతడును బుత్రికను జాటుగాఁ బిలిచిఅమ్మా ! నీవందరికిని వంకలు పెట్టుచుందువు. ఈగురుదత్తుఁ డెట్లుండెను? విద్యలోఁ బరీక్షించితివా? అని యడిగిన బాల ముసిముసి నగవులు నవ్వుచు మీరు పెద్దవారలు మీకంటె నాకు దెలియునాయని చెప్పినది.

అబ్బొ? ఈ పెద్దఱిక మింతకుమున్ను మాయందుంచితివా? మేమిష్టపడినవారిని నెందఱదూఱితివి. ఇప్పుడు నీకిష్టమయ్యెం గావున నిట్లనుచుంటివి. కానిమ్ము మాకది యును సంతోషమే భాగ్యముతో బనిలేదు. విద్యలో నెంతవాఁడని యడిగినఁ దండ్రీ ? ఇక దాచనేల గొప్పవిద్వాంసులు మనదేశములో నింతవారుఁ బేరని పొగడినది.

అంతలో నాచార్యునితోఁగూడ భుజించి గదాధరుఁడు వచ్చినవాఁడను వార్తవిని కుముదాంగదుండు చావడిలోనికివచ్చి చమత్కారముగా ముచ్చటించుచు గురునితోఁ దనయభిప్రాయము సూచించెను. బోజనపు వేళ గదాధరుండా గురునితో గురుదత్తుల యభిలాషయెఱిగించయున్నవాఁడగుట గదాధరునితోఁ గుముదాంగదుండు విననిట్ల నియె.