పుట:కాశీమజిలీకథలు -07.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అని వారు సంభాషించుకొనుచున్న సమయంబున నొక పరిచారిక ఫలముల కొన్నిదెచ్చి బల్ల మీఁదబెట్టి భుజింపుమని చెప్పినది. గదాధరుఁడు ఓసీ ఆచిత్రఫలక మెవ్వరిది? అని యడిగెను. మా అమ్మాయిగారిదేయని యత్తరము జెప్పినది. మీ అమ్మాయిగారి పేరేమి? యనుటయుఁ బద్మిని అని చెప్పినది. ఆమె చదువుకొన్నదా ? యని గురుదత్తుడడిగెను చదువు గిదువు నాకుఁ దెలియదు. మీరామెకు సమాధానము జెప్పఁగలరా?‌ గొప్ప గొప్ప పండితులు వచ్చి యోడితిమని పలికి బోవుచుందురు. అని చెప్పుచుండ లొపలినుండి మందలింపుచుఁ పద్మిని సీ ! మూర్ఖురాల! యిటురా! తెలియక పలుకుచుంటివి వారికడనా ! నీ యభ్యాఖ్యానము చాలు చాలు. ఈవలకురా ? అని చీరినది

దుందుభిధ్వనివలె మనోహరమైన యాకంఠధ్వనివిని గదాధరుండుబ్చుచు బద్మినీ ? యిటురావమ్మా ? నీ విద్యావిశేషములు వినియే నిన్నుఁజూడ వచ్చితిమి. పండితులతో నీవు సంభాషింతువని వినియుంటిమిగదా హృదయంగమంబులగు నుపోద్ఘాతములచే మాకుఁ జెవులు పండువు గావింపవా? అని పలికెను.


శ్లో॥ వైదేహి! యాహి కలశోద్భవ ధర్మపత్నీం
     ఆచక్ష్వ రావణవధాది కధాస్సమస్తాః
     వృష్ట్వాపి మా పదపయోనిధి బంధనంమే
     సైవాహ్యధశ్చు లికితాంబునిధే కళత్రం

సముద్రమంతయు నాపోశనమునగా గరతలంబున నిమిడ్చిన యగస్త్యమహర్షి భార్యతో ముచ్చటింపుచు సీతామహాదేవి తన భర్త సముద్రమునను సేతువును గట్టెనని ప్రగల్భముగొట్టిన నెట్లుండునో ? నేను మీకడవిద్వాంసురాలనని చెప్పికొనుట యట్లుండును మీరు మహావిద్వాంసులు ఎఱుఁగని దాదిమాట పాటింపవలదు ఫలముల భక్షింపుఁడు మాతండ్రి వచ్చు వేళయైనది. సంభాషింతురుగాక యని‌ చెప్పిన గదాధరుండు వికసించిన మొగముతో గురుదత్తుని జూచి తమ్ముఁడా ? యెట్టి యుపమానము దెచ్చినదియో చూచితివా ? అని మెచ్చుకొనియెను.

అంతలో నామెకుఁ జదువు జెప్పిన పండితుఁ డచ్చటికి వచ్చి పద్మినీ ! యని పిలుచుటయు నామె సిగ్గుచే నీవలకురాక లోపలినుండియే అయ్యగారూ ! అందుఁ గూర్చుండుఁడు. వారు పండితులు వారితో ముచ్చటింపుఁడని పలికినది. ఆతండా మాటవిని శంకించుకొనుచు జిత్రఫలకమునే చూచుచున్న వారింజూచి అయ్యా ? మీరెవ్వరు ? పండితులనినది మీరేనా? యేమి చదివికొన్నారు. అని యడుగు నంతలో గదాధరుఁడా సంస్కృతభాషతో నుపన్యసించి తన విద్యాపాటవము జూపి యతని కచ్చెరువు గలుగఁజేసెను