పుట:కాశీమజిలీకథలు -07.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురుదత్తునికథ

155

సభావిశేషములం జూచుచు అందు గాంచనపట్టికాఘటితమగు దర్పణాంతరంబున మెఱయుచున్న యొక చిత్తరువుంజూచి గురుదత్తుండు వయస్యా! యాప్రతిమ జూచితివా. కమలవిచక చక్రాదిచిహ్నితములై రక్తాంగుళీసంగతములై మృదువులై పాణి పాదములు వెలయుచున్నవి.

గదా -- అవును పాణిపాదములే కాదు అనుపూర్వ వృత్తములగు పిక్క లొక్కటియే యిక్కలికి చక్కఁదనము నొక్కి. వక్కాణింపుచున్నవిగదా ?

గురు -- ఆహా కంబువృత్తబంధురంబైన కంధరంబు ఈ ప్రతిమ సుందరం బప్రతిమానమని చాటింపుచున్నది చూడుము.

గదా - అదియొక టేల ? వట్రువులై నడుమంగన్పడు కెంపుగలిగిని యధరంబు, సంక్షిప్తంబగు చుబుకంబును, కలియ వక్రములై నల్లనై సాంద్రములగు భ్రూఁలతలు, ధవళరక్తత్రిభాగ భాసురములై ధీరసంచారమంధరములైన దృష్టి ప్రసారములు చంద్రకళాసుందరమగు లలాటంబు నింద్రనీలప్రభారమ్యములగు నలకపంక్తీయుంగలిగి విరాజిల్లు ముఖకమలంబు సోయగ౦బు కన్నులపండువు చేయుచున్నదిగదా.

గురు -- ఈచిత్ర ఫలకములలోని కన్నియ యేజాతి యువతియో చెప్పఁగలవా?

గదా - పద్మిని పద్మినియే సందేహములేదు.

గురు - ఆహా! ఇంతదేశము దిఱిగియు బ్రత్యక్షముగాఁ బద్మినీజాతి యువతిం జూడలేకపోయినను నేఁడిందీ చిత్రఫలకమైనఁ గనంబడినది కృతకృత్యులమైతిమి గదా.

గదా -- ఇది చిత్రకారుని రచనాచమత్కృతి యనుకొనుచుంటివాయేమి కాదు.

గురు -- మఱియేమి ?

గదా - ప్రతిబింబమే.

గురు -- ఇప్పు డిప్పుడమి నిటువంటి వాల్గంటులు గలరా ?

గదా - లేనిచో భవదీయ విద్యాగుణభాగ్య విశేషంబులకు సాద్గుణ్యమెట్లు ?

గురు -- ఈకన్నియ ప్రాయమెంత యున్నదనియెదవు ?

గదా - బాల్య యౌవనాంతర ప్రాయంబుగలదని యవయవ స్థౌల్యంబు దెలియపరచుచున్నది.

గురు - అగునగు నీకుసుమగాత్రికి విద్యాసౌరభ్య ముండునని తలంచెదవా ?

గదా - లేనిచో చతుర్ముఖుని నిర్మాణ కౌశల్యము నిందితవ్యము కాదా ?