పుట:కాశీమజిలీకథలు -07.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వలయు జెప్పుటకు మేము కవులముగాము. సామాన్యమైన నింతదూర మేలవత్తుమని పలుకుచుఁ బయనపు సమయమగుటయు నత్తెరవరులు మూటలుగట్టుకొని దక్షి ణాభిముఖముగా నరిగిరి.

గదాధరుఁడా మాటలువిని గురుదత్తునితో దమ్ముడా ? నీవు బద్మినినింగాని పెండ్లియాడనని నియమముజేసికొంటివి. నీశపథము సఫలమగునట్లున్నది. వీరిపలుకులు మన కుపశ్రుతులవలె నుదర్కమును సూచింపుచున్నవి. ఇఁక జాగుసేయనేల? వేగ మానగరంబునకుంబోవుదము లెమ్మని పలికినవిని యతండిట్లనియె.

అన్నా ! ఆచిన్నది నన్నుమాత్రము స్వీకరించునా ? నావిద్యారూపంబులు దానికి హృదయములగునో కావో ? అది మనకంటె జదివినదియేమో ? ఓడిపోయితిమేనిఁ బరాభవముకాదా? కానిమ్ము. నీ బుద్దిబలం బే తన్మాత్రంబే అనిపలుకుచు నాకలి కింజూచునుత్సుకత్వమెడ దంగందుకొన మిత్రునితోఁగూడ బయలుదేరి కతిపయప్రయాణంబుల నవ్వీటికఱిగెను.

దుర్గానగరంబునఁ బద్మిని విద్యారూపవిశేషముల నెఱుంగని వారులేరు. ఎవరి నడిగినను బాపురే ? యాబాలికయా ? ప్రాయమునకు మించిన విద్యగలది మంచిరూపము. మంచిగుణమని పొగడుచుందురు. కుముదాంగదునకు రాచ కొలువులోఁ గులపరిపాటిగ వచ్చుచుండెడి విత్తగణకోద్యోగంబు (షరాబుపని) గలదు. అందలి ప్రజలు పద్మిని సౌందర్యాదివిశేషంబులు పొగడుచుండ విని యుబ్బుచు వారిద్ధరు నొకనాఁడు వారింటికిం బోయిరి. ఏడంతరములుగల యాతని మేడ వారికి మిక్కిలి వేడుక గలుగఁజేసినది. వీథి యరుగులు విశాలముగా నున్నవి. అందు గూర్చుండి లోపలినుండి వచ్చిన యొక దాదితో షరాబు గారున్నారా? అని యడుగుటయు నది బాబూ ? వారు కొల్వునకుఁ పోయిరి. సాయంకాల మారుగంటలకు వత్తురని అది యుత్తరముజెప్పి లోపలికిఁబోయి అంతలోవచ్చి తాము లోపలికిదయదేసి చావడిలోఁ గూర్చుండుఁడు మీనివాస దేశమెయ్యది? పనియేమి యని అడిగిన గదాధరుండు ఈతఁడు వణిక్కులశిఖామణి నేను బ్రాహ్మణుఁడ మేమిరువురము బాటసారులమై యీవీటి కరుదెంచితిమి. మాకాపురము కుంభీనసపురము వీనితండ్రి కోటీశ్వరుఁడు రత్నాకరుండనువాఁడు. ఈ నగరంబునఁ గుముదాంగదునివాడుక విని కులపరిపాటి నీతఁడు జూడవచ్చె. వేరొండు పనిలేదని చెప్పెను.

ఆమాటలు లోపలినుండి పద్మిని విని వేరొకపరిచారికచేఁ గనకకలశములచే బాదములు గడుగుకొనుటకై జలమంపినది. లోపలికిరమ్మని వెండియుం బలికించినది. కాళ్ళు గడిగికొని వారు లోపలిచావడిలోనికిం బోయి పీఠములపయిం గూర్చుండి