పుట:కాశీమజిలీకథలు -07.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లక్షణము లాకన్యకయం దుండవలయు. పద్మినీ జాతి లక్షణంబు లెఱింగించెద నాకర్ణింపుము.

శ్లో. కమలముకుళ మృద్వీపుల్ల రాజీవగంధః
    సురతపయసి యస్సా స్సౌరభం దివ్యమంగె
    చకిత మృగదృశాబె ప్రాంతరకై చనేత్రే
    స్తవయుగళ మనింద్య శ్రీఫల శ్రీవిడంబి.

శ్లో. తిలకుసుమసమానాం విభ్రతీనాపికాంచ
    ద్విజ గురు సుర పూజా శ్రద్ధధానా సదైవ
    కువలయ దళకాంతిః క్వాపి‌ చాంపేయగౌరీ
    వికచ కమల కోశా కార కామాత పత్రా.

శ్లో. వ్రజతి మృదు శరీరం రాజ హంసీవ తన్నీ
    త్రివళిళతమనుమధ్యా మంజు వాణీమవేషా
    మృదుశుచిలఘు భుంకై మానినీ గాఢలజ్జా
    ధవళ కుసుమవాసో వల్లభా పద్మినీస్యాత్

ఇట్టి లక్షణములు గలదియే పద్మినీజాతి యువతి.

రత్నా - ఔరా నీమిత్రుని కెన్నికోరికలున్నవి ? నీసహవాసంబున వానికీ యభిలాషగలిగినదని తలంచెదను సంసారస్త్రీల కందమేమిటికి? నీవు జదివిన టక్కులన్నియు బోగమువాండ్ర కుండవలయును. పద్మినీలు మాకులములో లేరు మీ బాపన కులంబున నుందుఱేమో నీవేరికొని పెండ్లియాడుము.

గదా - నీకొడుకు నాకంటెఁ జాల చదివెను. వానికి నా యుపదేశ మక్కర లేదు. నీవు కోటీశ్వరుండవై నీకుమారుఁడు జక్కనిపిల్లం బెండ్లి జేయుమని కోరుట తప్పుగా గణించుచుంటివి అహా?

రత్నా - బాబూ ! మీతో మేము మాట్లాడఁజాలము. కులవిద్య నేర్పింపక శాస్త్రములు జదివించుట నాది తప్పు పుస్తకములలో వ్రాసినట్టు భార్యలు ప్రవర్తింప వలయునని కోరుచుండిరి. ఆ కోరికలు సంకల్ప రాజ్యములవంటివే కాని సత్యములు కావు. కానిమ్ము ఇప్పుడు వలసినంత ద్రవ్య మిచ్చెదను. పరి వారమిచ్చెదను దేశాటనముజేసి మీయిష్టము వచ్చిన పద్మినీల నేరికొని పెండ్లి యాడుండు. అని యుపదేశించుటయు వారికంతకుఁ బూర్వమట్టి సంకల్పము గలిగి‌ యుండబఁట్టి సంతోషముతో నంగీకరించెను.

తండ్రి యనుమతి గురుదత్తుండు గదాధరునితోఁ గూడ శుభ ముహూర్తమున నిల్లువెడలి కన్యార్థియై కొంతకాలము దేశాటనము గావించెను.