పుట:కాశీమజిలీకథలు -07.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురుదత్తునికథ

151

నిత్యము ధనికులగు వైశ్యోత్తములు కోరినన్ని కానుకలిత్తు మని యింటిచుట్టును దిఱుగు చుండిరి. పుత్రుని యౌవనోదయ మరసి రత్నాకరుండు పెండ్లిఁజేయు తలంపుతోఁ బ్రసిద్ధిజెందిన వర్తకుల పుత్రికల చిత్రఫలకముల గొన్నిటి దెప్పించి గదాధరుని రప్పించి వీని నీమిత్రునికుఁ జూపించి యిచ్చవచ్చిన మచ్చెకంటి నేరుకొమ్మని చెప్పుము..

అని యిచ్చి యంపుటయు వానింగొని గదాధరఁడు గురుదత్తు నొద్దకుం బోయి యా వృత్తాంతమంతయు నెఱింగించెను. గురుదత్తుండు మిత్రునితోఁ గూడ నాచిత్ర ప్రతిమల రూపము విమర్శించి వారిలో నొక్క రితయుఁ జక్కనిది కాకుండుట దెలిసికొని యాక్షేపించుచు తనకుఁ వివాహ మక్కరలేదని తండ్రికిఁ దెలియఁజేసెను.

ఆవార్తవిని యావర్తకుఁడు పరితపించుచు నొకనాఁడు గదాధరుని రప్పించి కుమారా ! లక్షలకొలఁది కానుకలతో బిల్లల నిత్తుమని పెక్కండ్రు కోటీశ్వరులు వచ్చుచుండిరి. నీ మిత్రుండొక కన్యక నంగీకరింపక పెండ్లి యాడనని చెప్పుచున్నాడేమి?

గదాధరుఁడు - అవును నీవు ద్రవ్యలాభమే చూచుచుంటివి కాని కన్యకాలక్షణంబులు పరీక్షించుట లేదు. నీవు చెప్పిన కన్యకలలో నొక్కరితయుఁ జక్కనిది లేదు. అందులకై అతండామాటఁ జెప్పెను.

రత్నాకరుఁడు - సరి. సరి. అదియా ? ఆలక్షణము లేవియో నాకుఁ దెలియవు కాగితముపై వ్రాసి యిమ్మనుము.

గదా - నీ కుమారుండు పద్మినీజాతి కన్యకంగాని పెండ్లి యాడనని చెప్పుచన్నాఁడు. సుంకమున కాసపడక యట్టిపడతిం బెండ్లి జేయుము.

రత్నా - పద్మినీజాతియా ? ఆ మాట నే నిదివఱ కెన్నడును వినియుండ లేదే? మాజాతికి నాజాతితో సంబంధమున్నదో లేదో చిన్నవారలు మీమాటల నమ్మి జీసితినేనిఁ గులములో వెలివేయుదురు.

గదా - (నవ్వుచు) పద్మినీ జాతియని మఱియొక కులము కాదు. స్త్రీ జాతిలో నుత్తమమైనది.

రత్నా - ఇదియే కదా ? నీమిత్రు నభిప్రాయము. ఎక్కువ కానుక లెవ్వ రిత్తురో వారి పిల్లయే పద్మినిజాతి యువతియని చెప్పుదము. తలిదండ్రులచేత నట్లు చెప్పింతము. తెలిసినదియా ?

గదా -- ఆహా ఏమి నీ మోహము. ఇత్తడి బంగారమనిన నమ్ముదురా ? ఆ