పుట:కాశీమజిలీకథలు -07.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురుదత్తునికథ

149

దేవాలయమున గోడమీఁదఁబై పద్యము వ్రాయఁబడి యుండఁ దానిం జదివికొని మొదటి పాదములు కొన్ని చెరపఁబడి యుండుటచే వాని విడిచి తెలిసిన వానినే వ్రాశికొని అతివేగముగా నయ్యగారియొద్దకు వచ్చి అప్పద్యము జదువుచు నిందేదియో మంచి కథ స్ఫురించుచున్నది. ఆ కథ యెవ్వరినడిగిన చెప్పలేకపోయిరి ముందుగా దీని వృత్తాంత మెఱింగింపుఁడని ప్రార్థించెను.

మణిసిద్ధుండు తనమణి మహిమ నయ్యుదంతమంతయుం దెలిసికొని వెరగుపడుచు నాకథ నిట్లు చెప్పందొడంగెను.

సముద్రతీరంబునఁ గుంభీనసఁ బకు నగరము గలదు. అప్పురంబున రత్నాకరుండను వర్తకుండు నౌకామూలకముగా ద్వీపాంతర వ్యాపారము గావించుచు నపారమైన ద్రవ్యము సంపాదించి కోటీశ్వరుండను ప్రసిద్దివడసి కాపురము సేయుచుండెను. అతనికి యుక్తకాలమున సంతానము గలిగినదికాదు. అక్కొరంతయే అతనికి సంతోషమును దిగమ్రింగుచుండెను.

సులక్షణయను పేరుగల యాబేహారిభార్య అసత్యరాహిత్యమునకు వగచుచు నొకనాఁడు భిక్షార్థమై అరుదెంచిన యొక బ్రాహ్మణుం జూచి నమస్కరించి బిచ్చము వేయుచు అయ్యా ! మీకుఁ బిల్లలెందరని అడిగినది.

ఆపాఱుండు కన్నీరునించుచు అమ్మా ! నాకు సంతతిలేదు. మేమేడ్వుర మన్నదమ్ములము. అందరిలో నేనొక్కరుండనే విద్యాధనసుతవిహీనుండనై పొక్కుచుంటిని. లేమికంటె బిడ్డలు లేమికై నా భార్య మిక్కిలి వగచుచున్నది. అన్నము తినదు. నిద్రవోవదు. సంతతముకంటఁ దడివెట్టుచుండును యాత్రలకుఁ బోవుదము రమ్మని వేపుచుండును తల్లీ దరిద్రులమెట్లుపోగలము అని తనకథ జెప్పుకొనియెను.

అప్పుడామే ఔరా? యీపౌఱుండు బిచ్చమెత్తికొనుచుండియు బుత్రరాహిత్యమునకుఁ జింతించుచున్నాడు అగునగు నందుల కాక్షేపింపరాదు. పుత్రానంద మందఱకును సమానమే? అని తలంచుచు నార్యా! మీకుఁ దీర్ఘయాత్రలకు గావలసిన ద్రవ్యము నేనిచ్చెదను. మీరు దేశములు తీర్థములు తిఱిగి సంతతి గలుగు మంత్ర తంత్రము లేవేని‌ సంపాదించుకొనిరండు. పుడమి నెందైన మహానుభావు లుండకపోరు మీరు వచ్చువఱకు మీ భార్యను నేనుబోషించుచుండెద దైవకృప మనయభీష్టము దీరెనేని మిమ్ము మీఅన్నలకన్న భాగ్యవంతునిగా జేసెదనని చెప్పి అతని నొప్పించి కొంతసొమ్మిచ్చి అంపినది.

సుదక్షిణాప్రేరితుండై యాక్షితిసురుండు శుభముహూర్తమున నిల్లుకదలి కాశీ రామేశ్వరాది యాత్రలు సేవింపుచు నుత్తరారణ్యభూములన్నియుందిఱిగి మహాత్ముల