పుట:కాశీమజిలీకథలు -07.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

కాశీమజిలీకథలు - సప్తమభాగము

యర్దయామములో నుజ్జయినీపురంబు బ్రవేశింప జేసెను. తొల్లిపుష్పకారూఢుండై చనుదెంచిన శ్రీరాము౦డువోలెఁ బట్టణమునకు సతీపతి యుక్తముగా జనుదెంచిన విజయభాస్కరుని వృత్తాంతము విని పౌరలాశ్చర్య మందుచు గుంపులుగా వచ్చి యమ్మహారాజు కుటుంబమును జూడఁ దొడంగిరి.

వియోగ చింతాసాగరంబున మునిగియున్న హేమప్రభం గౌగలించుకొని బుజ్జగింపుచు విజయభాస్కరుఁ డామెకునుఁ దల్లికిని బరమానందము గలుగఁ జేసెను.

అట్లు విభీషణుఁడు వారినెల్ల స్వస్థానమునఁ బ్రవేశపెట్టి జయసింహ వీరసింహులఁ భార్యలతోఁగూడ నప్పు డప్పుడు తన పట్టణంబునకు వచ్చునట్లు నియమించి యొక విమానమర్పించి కుమారునితోఁగూడ నిజనివాసమున కరిగెను.

క. గిరియెక్కిపడిన ధర సా
   గరమున మునింగినను బావకముజొచ్చిన భీ
   కర ఫణులతోడ నాడిన
   మరణకాలమురాదు మహినెవ్వరకిన్‌.

అనుపద్యమును దన దేశమెల్ల జాటింపఁజే యుచుఁ దాను బోయివచ్చిన వృత్తాంతము ప్రకటించి విజయభాస్కరుం డిరువుర పుత్రులతోఁ భార్యలతోఁబుడమిఁ బెద్దకాలము రాజ్యము గావించెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు వత్సా ! విచిత్ర కధామనోహరంబగు విజయభాస్కరుని చరిత్రము జదివినను విన్నను పవిత్రుండై యభీష్టకామంబులం బొందఁ గలఁడు సుమీ! యని వివరించెను. శిష్యుండాకథవిని ప్రహర్షసాగరమున మునుఁగుచు నావృత్తాంతమే స్మరించుకొనుచు గురునితోఁ గూడ నవ్వలి మజిలీ చేరెను.

123 వ మజిలీ.

గురుదత్తుని కథ

ఉ. భూపతిజంపితి న్మగఁడు భూరి భుజంగముచేత జచ్చెఁ బై
    నాపదజెందిచెంది యుదయార్కుని పట్టణమేగి వేశ్యనై
    పాపము గట్టికొంటినటఁ బట్టి విటత్వము బూనిరాఁగ సం
    తాపముజెంది యగ్గిఁబడి దగ్దముగా కిటు గొల్లభామనై
    యీపని కొప్పుకొంటి నృపతీ! వగపేటికిఁ జల్ల చిందినన్‌

గోపకుమారుండా మజిలీయందలి పట్టణవిశేషంబులం జూడఁ బోయి యొక