పుట:కాశీమజిలీకథలు -07.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహాయోగికథ

147

చిన వీని నర్చించుటకు రాక్షసరాజపుత్రిక యగు నీచంపక యామోదించుచున్నది. అని పలుకుచు అవ్వనితను నియోగించినది.

అప్పుడు చంపకలేచి పుష్పమాలంబూని వీరసింహుని దాపునకుబోయి ఆర్యా ! నీవదృశ్యుండవై మాయంతఃపురమునకు వచ్చి మా హృదయంబు హరించినచోరుండవు నిన్ను బద్ధుంజేయవలసినదియేకాని మాపక్షము వహించి పోరిమాకు విజయము గలుగఁజేసితివి కావున గానుకగా నీ మాలిక నర్పించుచుంటి మదీయ చిత్తం బిదివరకే నీయధీనమైనది కై కొనుమని పలుకుచు మెడలో వైచిరి.

అతండు వేరొకమాలికనందుకొని యామె‌ మెడలో వైచెను. స్త్రీలు పూవుల జల్లిరి. జయ జయ ధ్వానములతో దదీయ విజయగీతములతో సభముగిసినది.

మరునాఁడు విభీషణుఁడు సపుత్రకముగా నేలాపుత్రు రప్పించి నీవు రాజ్యార్హుండవు గావని అతండు గావించిన తప్పులన్నియు నిరూపించి నిందించుచుఁ గొన్ని గ్రామంబులు మాత్ర మిప్పించి నాగరాజ్యమునకెల్లఁ గౌరవ్యునే బట్టభద్రుం గావించెను. కౌరవ్యుఁడు లంకాధిపతి అనుమతివడసి శుభముహూర్తంబునఁ దేజోవతిని జయసింహునకిచ్చి వివాహము గావించెను. పాతాళలోక విశేషములు జూచుచుఁ బది దినములు వారందుండిరి.

తరువాత విభీషణుఁడు వారినెల్ల లంకాపురంబునకు సగౌరవముగాఁ దీసికొనిపోయి మహావైభవముతో వీరసింహునకుఁ జంపక నిచ్చి వివాహము గావించెను.

అంత

మ. జయసింహుఁడును వీరసింహుఁడును యోషారత్న ముల్మాసనఁ
     ప్రియముల్సేయఁగ వారిఁ గూడి మదనక్రీడాపయోరాశిన
     వ్యయసౌఖ్యంబున దేలి యాడిరి మనోజ్ఞా రామ కేళీళిలో
     చ్చయవాపీతటినీతటస్థలుల స్వేచ్ఛాయుక్త సంచారులై.

అట్లు వారు పరమానందభరితులై లంకాపట్టణ విశేషంబులం జూచుచుఁ గొన్ని దినంబులందు వసించిరి. వీరసింహుఁడు మత్స్యంబువలనఁ దనకు లభించిన రత్నంబు పారిజాతునిదని యెఱింగి యమ్మణి నతనిం బుచ్చుకొమ్మని ప్రార్థించెను. కానియతం డంగికరింపలేదు.

పిమ్మట స్వదేశదర్శనలాలసుండైని విజయభాస్కరుని యభిలాష యెఱింగి విభీషణుండు విమానశాల నుండి వారినిమిత్త మొక విమానము దెప్పించి యనర్ఘ కాంచనమణీ వస్తువిశేషంబు లెన్నియేని వారికిచ్చి తేజోవతి చంపకలకు దాసీ సహస్రము లరణమిచ్చి యందఱ విమాన మెక్కించి కుమారునితోఁ దానుగూడ నెక్కి