పుట:కాశీమజిలీకథలు -07.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19]

మహాయోగికథ

145

కౌరవ్యునింట బిడ్డతోవసించి కాలక్షేపము జేసితిని. నీయుదంత మెఱింగితిని. దైవ మిప్పటి కనుకూలుఁడయ్యెను. మనకు మానవదుర్లభమైన లంకాధిపతి దర్శనమైనది మఱియుం బాతాళలోకము మర్త్యులకుఁజూడశక్యమైనదియా ? ఈ పయనములో మన కపూర్వవస్తు సందర్శనలాభము గలిగినది రక్తాక్షు డే మనకీ యుపకారము గావించెనని పలికి యూరడించెను.

అప్పుడు విభీషణుండు మహారాజపుత్రా ! నేసు రాత్రించరుల నరుల బాధ పెట్టకుంట శిక్షింప నియమించియే యుంటివి వజ్రకంఠుని ప్రోత్సాహమున సముద్ర మధ్య గృహంబుననున్న హేమప్రభను దీసికొని వెళ్ళుటకు తదనుచరుండైన రక్తాక్షుం డరుదెంచి యందాసుందరిం గానక నీవు దీసికొనిపోయినవిధం బెఱింగి కోపించి తొలుతఁ దన దూతల దీర్ఘదంతశూలసఖులను వారు నిన్నుఁ గట్టి తీసికొనిరమ్మని నీయొద్ద కనిపెనఁట భవదీయ ద్వారపాలకుండైన భేతాళుండు కోటలోఁ బ్రవేశించు చుండ వారిరువురం బట్టికొని దీర్ఘదంతునిదంతం బూడబెరికి శూరనఖుని చేతులు విరచిపాదంబులం బట్టికొని గిరగిరంద్రిప్పి విసిరి పారవైచెనఁట.

వాండ్ర పరిభవము జూచి రక్తాక్షుండు భేతాళునకు వెరచి బ్రాహ్మణవేషంబున నీయొద్దకువచ్చి కోటలోనికి రాక మాయజేసి మిమ్ముఁ తీసికొనివెళ్ళెను. ఆకథ మొన్ననే నాకు మాదూతలు నివేదించిరి హేమప్రభాపుత్రుఁడు మాకుఁ దోడుపడి యుపకారముగావించెను . హేమప్రభ రాక్షసవంశ సంజాతయేకావున మాకుఁ జుట్టమైనది. నీ యిద్ధరి పుత్రులతో వచ్చి మాలంకాపట్టణము పాలింపుము. నేను బెద్ద వాఁడనైతిని సామర్థ్యములేదు. ఉన్నవారి పాలనము సమంజసము కాకపోవుటచేతనే మీకీబాధ గలిగినది అని ప్రార్థించుచుండగనే కౌరవ్యుఁడు సబంధుకముగా వచ్చి విజయభాస్కరుని పాదంబులంబడి యిట్లనియె.

ఆర్యా ! నీభార్యయుఁ బుత్రుఁడును మాయింటవసించి మమ్ముఁ గృతార్థులఁగావించిరి, ఎఱుఁగక వారి నేమేని న్యూనతపరచితిమేమో క్షమింపవేడుచున్నాను. నీవును మాచుట్టరికము తెలియక యేలాపుత్రునకు సహాయము జేసితివి. నీకుమారుం డెఱింగియు ధర్మమునకై పోరాడెను. తొల్లినాగదౌహిత్రుండగు బభ్రువాహనుఁడు తండ్రితోఁ బోరలేదా ? అది వీరథర్మము ? అందుల కతండు సిగ్గుపడుచున్నాడని వింటిని. ఆ పనియే వానికీర్తికి మెఱుఁగు బెట్టుచున్నది. మా తేజోవతి వానిని వరించినది. కావున పాతాళలోకరాజ్యముతోఁ గూడ మాపిల్లం బరిగ్రహింప నీపుత్రుండు పాత్రుండై యున్నవాఁడని కోరుకొనియె

అప్పుడు విజయభాస్కరుఁడు కౌరవ్యుని మిక్కిలి స్తుతిజేయుచు తండ్రీ