పుట:కాశీమజిలీకథలు -07.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లకై పోరాడి మూర్ఛ మునింగితిమి నీవు జదివిన పద్యమువలన నీవు నాకు సహోదరుఁడవని తెలిసికొంటిని. నీవు హేమప్రభ కుమారుఁడవని తలంచుచుంటిమి. ఇతఁడే మనజనకుఁడు విజయభాస్కరుఁడు. కనువిచ్చి చూడుము. నీ వెట్టు వచ్చితివి ? నీ వృత్తాంత మెఱింగింపుమని పలుకుచుఁ దన కథ యెఱింగించిన విని వీరసింహుఁడు విభ్రాంతుండై కొంతసేపు సంతోషము పట్టజాలక వివశుండై యెట్టకేలకు దెప్పరిల్లి తండ్రికి నమస్కరించి యతనిం గౌఁగలించుకొనుచు నిట్లనియె.

అన్నన్నా ! విధిపరిపాకము యెంతచోద్యమైనది తేజోవతివలన నీ వృత్తాంత మంతయును వింటిని. ఆ చిన్నది నీ నిమిత్తమై పడిన దుఃఖమునకు మేరలేదు గదా? అట్టివారిపై గత్తిగట్టితివి. అది వీర ధర్మము. నీ పని యెఱింగిన వారింత చింతిల్లకపోవుదురు. పాపమా కౌరవ్యుఁడు కొన్నిదినములు శత్రువులకు లొంగియుండెంగదా ? మన తండ్రిగారి శాంతమే యింత వింత గలుగఁజేసినది. వారు దలంచుకొనినఁ దలాతలవాసులు విజృంభింతురా? పై పెచ్చు వారికే వుపకారము జేయించిరి. దుర్జనుల కుపకారము జేయుటచే సుజనులకుఁ బీడ గలుగుచున్నది. అక్కటా ! దండ్రీ ! నీ వొక్కండవు దిక్కు మాలి పాపుల మధ్యమున నాతలాతలమున నిన్నినాళ్ళెందులకు వసించితివి. నీవె తలంచిన లోకములు తలక్రిందులుకావా? అని పలుకుచుఁ దాను జనించినది మొదలు నాఁటి తుదదనక జరిగిన కథ యంతియు నెఱింగించెను.

ఎల్లరు విస్మయము జెందిరి. విజయభాస్కరుం డిరువురకుమారుల నక్కునం జేర్చుకొని ముద్దువెట్టుకొనుచు వత్సలారా ! మనమెందులకును స్వతంత్రులము గాము. అంతయు దైవమే చేయించుచుండును. కర్మానుసారముగా బుద్ది బొడముచుండును. నే నప్పుడే యా రక్కసుని కంఠము పిసికినచో నింతకథ యెట్లు జరుగును. అందులకే కలభాషిణి‌ బోధించుచున్నను నాకట్టిబుద్ధి పుట్టినదికాదు. ఈ మహానుభావుని దర్శనము మానవుల కెవ్వరకేని దొరుకునా ? మన పురాకృతము పండుటచే లభించినది. ఆరక్తాక్షుం డీరూపమున మన కుపకారి యయ్యెను. లేకున్నఁ గూపకూర్మమువలె మన మింటియొద్దనేయందుము గదా. దైవ మనుకూలుఁడయ్యె నేని అపకార ముపకారమగును. ప్రతికూలుఁడైనచో నుపకార మపకారమగును అని పెద్దగా నుపన్యసించెను.

అంతకుఁ బూర్వ మంతఃపుర కాంతలతో వచ్చి యాసంవాద మాలించుచున్న కలభాషిణి తటాలున వచ్చి హా! ప్రాణేశ్వరా! అని పలుకుచు భర్త పాద౦బులంబడి దుఃఖించినది. అతండు లేవనెత్తి గారవింపుచు, బ్రేయసీ ! విచారింపకుము. నీవు