పుట:కాశీమజిలీకథలు -07.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహాయోగికథ

143

గలిసికొంటిమి కలభాషిణి మీ యొద్దనున్నదని వింటి యీ జయసింహుడు తన్నుఁ బోషించినవారి బరిభవించితినని దుఃఖించుచుఁ బ్రాణత్యాగము జేసికొనఁబూనుచున్నాఁడు అందుల గుణదోషంబుల నిరూపించి వీరికిఁ బ్రాయశ్చిత్తం బెఱింగింపుము. నీ కంటె ధర్మాధర్మ వివేచనము సేయ మఱియొకనికి సమర్ధత లేదు. అని పలికిన విని విభీషణుండు పులకితగాత్రుండై యిట్లనియె.

ఒహోహో ? నేఁడెట్టి సుదినము. నా చిరకాల జీవితమునకు సాద్గుణ్య మిప్పటికిఁ గలిగినది. మహాపుణ్యపురుషుల మిమ్ము బొడగంటిని. మీ తాతగారి సాహస వితరణాది గుణ గుణంబులు వియచ్చరులు పొగడుచుండఁ బెక్కుసారులు వింటిని. మీ జయసింహుడు గావించినపని త్రిలోక వీరలోక సంస్తుత్యమై యొప్పుచున్నది. ఇట్టి సత్యసంధు నెందునుం జూచి యెఱుంగను. గురువచనంబునందలి గౌరవంబునం జేసి‌ తన కత్యంత ద్రోహుండైన శత్రువుపక్షము వహించి ప్రాణబంధువుల కపకారము గావించెను. ఇట్టి సౌజన్యనిధి యెందుఁగలఁడు. అని అతని సుగుణంబులఁ గైవారము సేయుచు వారిరువుర గౌరవ్యుని మందిరమునకు రమ్మని ప్రార్థించెను.

జయసింహుఁడు సిగ్గుపడుచుఁ దన్నఁ దప్పుజేసిన వానిఁగాఁ దలంచుకొనుచు, గౌరవ్యుని యింటికి వచ్చుటకు సమ్మతింపడయ్యెను. అప్పు డాలోచించి విభీషణుఁడు తమ వీరలనందల మెక్కించి అక్క డకుఁ దీసికొనిరమ్మని నిరూపించటయు దూతలు వోయి వానిం దీసికొనివచ్చిరి.

విజయభాస్కరుఁడు వాని యాకారలక్షణంబులు పరిక్షించి వీఁడు హేమప్రభ కుమారుండాయని యాలోచించుచుండెను.

ఆకారసాదృశ్యము జూచి యిరువురు అన్నదమ్ములని చూపఱులు నిశ్చయించిరి. జయసింహుఁడు సహోదర భావంబున వానిపైబడి విలపించుచుండెను. అప్పుడు విభీషణ ప్రోత్సాహంబున విజయభాస్కరుఁడా కుమారుని మేను నివురుచు

 
క. మాతాత విక్రమార్కుడు
   పూతచరిత్రుండు ధర్మబుద్ధి వితరణ
   ప్రీతుండై త్రిభువన వి
   ఖ్యాతుండగు నేని వీఁడనామయుఁడగుతన్.

అని పలికినంత వీరసింహుండు మహావీరా ! నిలు. నిలు. పోకు పోకు. మని పలుకుచు దిగ్గున లేచెను. అంత జయసింహుం డతనింగౌఁగలించుకొని అన్నా ! నేనిందే యుంటిని నేను శత్రుండగాను. మన మన్నదమ్ములము ఎఱుంగక యొరు