పుట:కాశీమజిలీకథలు -07.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

కాశీమజిలీకథలు - సప్తమభాగము

గీ. నిన్నుఁజూడగంటి నేను ధన్యుఁడ నంటి
    వసుధలేడు నాదువంటి సుకృతి
    కావుమయ్య పాద కమలంబులను నాశి
    రంబునందు మోపి రాక్షసేంద్ర !

క. అనఘా ! జననంబున కే
   దనుజుండవు గాని నితాంతతపశ్శాల
   తనియత మానవ శుద్దికి
   నెనవత్తురె యెట్టి తాపసేశ్వరులై నన్‌.

అట్టి నిన్నుఁ బ్రత్యక్షముగాఁ జూచితిమి మీ వంటి పుణ్యాత్ములు లేరని స్తోత్రములుజేసిన విని వీభీషణుండు అతనికి నమస్కరించుచు మహాత్మా! నీవద్భుత ప్రభావసంపన్నుఁడవని నీ చరిత్రములవలనఁ దెల్లమగుచున్నది. నీ తపస్సామర్థ్యంబుననే దుర్బలులైన రక్కసులుకు గలిగి విజయమందిరి. నీవు తపోధనుండవయ్యు నసాధువులగు యాతుధానుల కేమిటి కుపకారము గావించితివి ? నీవా తలాతలంబున కెట్లు వచ్చితివి? నీవృత్తాంతము విన వేడుకయగుచున్నది. మఱియు మీ వీరుండు కౌరవ్యునిచేఁ జంపబడినవాఁడే ? వానిం బ్రతికించినట్లే మా వీరునిఁ గూడఁ బ్రతికింపరా? అని ప్రార్థించిన విని యా యోగీంద్రుఁ డిట్లనియె.

దానవేంద్రా ! నా వృత్తాంత మింతవఱకుఁ గోప్యము జేసితిని. విష్ణుభక్తుండవగు నీ కడ నసత్యములాడరాదు. వినుము నేను విజయభాస్కరుండనువాఁడ విక్రమాదిత్యుని మనుమఁడనిక్షేపము నెపంబున భూసుర వేషముతో నొక రాక్షసుఁడు భార్యతోఁ గూడ నన్నెత్తికొని వచ్చి నన్నీ తలాతలంబునం బెట్టైను. అది ప్రారబ్దముగాఁ దలంచి యెవ్వరిని నిందింపక రాక్షసపీడితుండనై కొంతకాల మందుంటిని. రాక్షసులు నాకెన్ని యేని బాధలు గావించిరి. దైవవశంబున నా బాధలు నన్నంట లేదు. పిమ్మట వారికి నాయందు భక్తి విశ్వాసములు గలిగినవి గురవుగా నెంచి నన్నుఁ బూజించుచుండిరి. అందు నేను దపంబు గావింపుచుంటిని. మఱియొక నాఁ డీకుమారుని యొడలెల్లఁ గట్టించి పారిజాతుండు తలాతలంబునఁ బడద్రోయించెనఁట.

వీ డందుగల రక్కసులనెల్ల నుక్కుమాపి పీడించుచు మన్నియోగంబున శాంతుడై యందుఁ గొన్ని దినంబులు వసించెను. వజ్రకంఠుని యాశ్రయంబున నిక్కపటంబు దెలియఁక నేనే వీనిని యుద్ధంబునకుఁ బొమ్మంటిని. ఈ జయసింహుఁడు నాకుమారుండు కలభాషిణీ పుత్రుండు. మీ అనుగ్రహంబున నిందు