పుట:కాశీమజిలీకథలు -07.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

కాశీమజిలీకథలు - సప్తమభాగము

    ధాస పరుండనేనిఁ బరదార పరద్రవిణాభిలాషలం
    బూనినవాఁడనేనిఁ నృపపుత్రుఁ డితండు నిరామయుండగున్‌.

అని పలికినంత అక్కుమార శేఖరుండు నిద్రించి మేల్కొనినట్టు లేచి కన్నులు నులిమికొనుచు అయ్యోగికి నమస్కరించెను.

ఆమాటవిని విభీషణుండు గుండెలు తడబడ దద్దరిల్లుచు నయ్యో ప్రవస్తా! ఆ వీరుండు మూర్ఛనుండి లేచెనఁట ఇఁక మనము గాచికొనవలయు నేమని విజయమునకు విపరీతము గలుగక మానదు. వాని ముందర మనము నిలువఁజాలము అయ్యోగి సత్తముని తపో మహత్వమున వానికట్టి సత్వము గలిగినది. దయాసత్య విహీనులైన దుర్మతుల కయ్యతి యుపకృతి జేయుచున్నాడేమి? మనముపోయి యాతని నాశ్రయింతమా! మనవీరుండు లేచు నుపాయమేదేనింగలదా! ఇప్పుడేమి జేయఁదగినదియో యాలోచింపుమని పలికిన విని ప్రహస్తుండు దేవా! వాఁడు దేవదాన వాజేయుండగుట నిక్కవము. వానికి మనవీరుఁడే తగినవాడు. యోగి వానిం బ్రతికించెను. దేవర వీనిం బ్రతికింపవలయును. అయినను దరువాత వృత్తాంతమువిని కర్తవ్యమాలో చింతము సారణా! అందు తరువాత నేమి జరిగినదియో చెప్పు మనుటయు వాడిట్లనియె.

దేవా! దేవరమాట కడ్డుజెప్పిన గోపింతురని యూరకుంటిని అందులకై మనమేమియుఁ దొందరపడవలసిన పనిలేదు వినుండు

అట్లు లేచిన యాహరిదాసుం గ్రుచ్చియెత్తి అయ్యోగి సత్తముఁడు కుమారా మన ప్రయత్నమంతయు రిత్తవోయినది. మనలను శరణుజొచ్చినవారలుశత్రుహస్తగతులైర. నీతోఁబోరినవీరుఁ డెవ్వఁడు వత్సా ! చెప్పుమని అడిగిన నతండు దీనస్వరముతోఁ నిట్లనియె.

తండ్రీ! నేను మహాపాపాత్ముండ నావంటికృతఘ్ను డెందును లేడు. పెంచిన బరిభవించితిని నాకు నిష్కృతిగలదా? అయ్యయో? నా నిమిత్తమై ఈ రాజపుత్రిక యెట్టియిక్కట్టు జెందుచున్నదో చూడుఁడు నావృత్తాంత మెవ్వరికిం జెప్పవలదని మా తల్లి శాసించుటచే మీకెఱింగించితి కాను. ఇఁక దాచినం బ్రయోజనంబులేదు. నేను విక్రమార్కుని మనుఁమడగు విజయభాన్కరునికిఁ గుమారుండ మాతల్లి పేరు కలభాషిణి నేను గర్భస్థుండనై యున్నపుడు రాక్షసుండొకఁడు భూసురవేషంబునఁ జనుదెంచి మా తల్లిదండ్రుల నెత్తి కొని పోయెను. మాతండ్రి నేమిజేసెనో దెలియదు. నేను బుట్టిన నెలలోపుగనే యెట్లో కౌరవ్యుని యింటికిఁ జేరితిని. ఆ దంపతులు నన్నత్యంతవాత్సల్యంబునం బెంచి విద్యలం గరిపి పెద్దవానింజేసిరి. తేజోవతి నన్నుఁ