పుట:కాశీమజిలీకథలు -07.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లిరువురు నొకరినొకరు మించులాగున లంఘించుచు నేయచుఁ బొడుచుచు ద్వంద యుద్ధములం గావించిరి. అపుడు రెండు బలంబులంగల యోధులాయుధములం బారవైచి వారి యాయోథన వైచిత్ర్యంబుఁ జూడఁదొడంగిరి. మూఁడ హోరాత్రంబు లేకరీతి నావీరులు బోరాడిరి. జయాపజయంబు లెవ్వనికిం గలుగలేదు. అపుడు మనవీరుఁడు విసిగి -

చ. కులపతివిక్రమార్క నృపకుంజరుఁడుత్తమ దానధర్మ ని
    ర్మలమతియేని భాస్కరుఁడు మజ్జనకుండు పరోపకార ని
    శ్చల దృఢచిత్తుఁడేని సురసంస్త వనీయ మహాపతివ్రతా
    తిలకమయేని మజ్జనని ద్రెంచురిపున్ నిశిఖంబమోఘమై.

ప్రతివీరుండు.

గీ. యోగివర్యుండు సతతపరోపకార
    తత్పరుఁడయేని నాతలిదండ్రుల సమ
    ధర్మరతులేని నేనని ధర్మబుద్ది
    జేయుదునయేని వీని శాసించు శరము.

అని పలుకుచు వారిరువురు నొకరిపై నొక రాయుధంబుల బ్రయోగించుకొనిరి ఒకని సాధన మొకనికిఁ దగిలినంత నిద్దరును వివశులై నేలంబడి మూర్ఛిల్లిరి. అప్పు డుభయసేనలలో హాహా కారంబులు నింగిముట్టినవి. పిమ్మట మనవీరుని మనవారును బ్రతివీరుని శాత్రువులును నిరపాయస్థలమునకుఁ దీసికొనిపోయి కాపాడుచుండిరి. అప్పుడు మహారాజుగారు హృదయశూలమై ప్రతివీరుని యుద్ధతి యడంగినంత సంతోషముతో శంఖము బూరించుచు సేనల కుత్సాహము గలుగజేసి అవలీల సవక్ర విక్రమంబునఁ పరబలంబులం బారదోలి శత్రుహస్తగతంబైన కౌరవ్యుని కోట వశము చేసికొనిరి. మన వారందరు అందుబ్రవేశించిరి. పిమ్మట మాయొడయండు మీకీ విజయంబెరిగించి మిమ్మునందర నక్కడకుఁ దీసికొనిరమ్మని నన్నంపెను.

అని శార్దూలుండు ఎరింగించుటయు విని చంపక హృదయంబునఁ గంపము జనింప నో శార్దూలా? మన వీరుండు మూర్ఛనుండి లేచునా? వానిమాట యేమనుకొనుచున్నారు? ఎందు బరుండబెట్టిరి, కయ్యంబున అతఁడు గావించిన యుపకారంబు దలంచుచుండిరా? అయ్యో! పాపమతండు అని యున్మత్తవలె వానిగుఱించి అడిగిన మాటయే అడుగుచుండెను. ఆనడుమ తేజోవతి జయసి౦హుని వార్త ఏమైనం దెలిసినదా అని యడిగినది. అప్పుడు శార్దూలుండు అమ్మా! నేను వచ్చునప్పటికి నావీరుండు మూర్ఛనుండిలేవలేదు. వాఁడుజేసిన యుపకారముగురించి పెద్దగాస్తుతియింపుచుండిరి. బ్రతుకునను నాసతో దగిన యుపచారములం జేయుచుండిరి.