పుట:కాశీమజిలీకథలు -07.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అమ్మా ! మనవారింకనుమూర్ఛనుండి లేవలేదు. ఇది మన వారి ప్రజ్ఞకాదు. వినుండు మనవ్యూహమునకు నా వీరపురుషుం డెట్లు వచ్చెనో తెలియదు. మనవీరులందరు పిరికితనము వహించు దనుక నూరకొని అంతలోఁ దురగారూఁఢుఁడై శంఖము పూరించెను.

ఆధ్వని విని పరబలంబులు చెవులు బీటలువార శార్దూల ఘోషంబు వినిన మేషంబులవలెఁ జిందవందర జొచ్చినవి. అప్పుడు మన వీరుండు సేనల కుత్సాహము గలుగఁజేసి రౌద్రా వేశముతోఁ బ్రతిబలంబుల గలిసి కరవాలంబుల నేసియు శూలంబులం బొడిచియు శరంబులసేసియు శీఘ్రకాలములో మంధరము సముద్రమువోలె సంక్షోభమునొందజేసెను.

వానిముందర నొకవీరుండైన నిలచినవాడు లేడు. రణాంగణమంతయు బట్టబయలైపోయినది. మనవీరుండు శంఖము బూరించుచు వారిం దరిమికొనిపోయెను. అప్పుడు మన బలంబుల సింహనాదంబులు జయజయధ్వానములు నాకసము ముట్టినవి. పడిపోయిన మనవీరులింకను మూర్ఛ దేలలేదు. అవ్వలి వీరుండింకను ననిమొనకు రాలేదు. ఇంత పట్టుచూచి వచ్చితినని చెప్పెను. ఆ వృత్తాంతము విని చంపక యెడద బొడమిన ముదము ప్రకటింపక చారులారా! మీరు పొండు మఱల వేగవచ్చి తరువాత యుద్ధవృత్తాంతము మెఱింగింపుఁడు ప్రతివీరుని పరాక్రమము చూచువరకు మనవిజయము నమ్మరాదని పలికి వారినంపి యక్కలికి కలభాషిణంజూచి యిట్లనియె.

దేవీ ! నీపుత్రుం డధికపరాక్రమశాలియని తెల్లమగుచున్నది. ఇప్పుడు రాక్షస వీరులకెల్ల రక్షకుఁడై పోరుచున్నాడఁట. మనకు దప్పక విజయము గలుగఁగలదు. అనివాని‌ గుణంబులు కొనియాడుచుండఁ దేజోవతి యరుదెంచి అక్కా! జయసింహుని వార్త యేమయినం దెలిసినదా? అతండు బ్రతికియుండెనేమో తెలిసికొంటివా? యని యడిగినఁ జంపక అయ్యో యీవిజయోత్సాహములో వానిమాట యడుగుట మరచితిని. రేపు మఱల దూతలువత్తురు. తప్పక తెలిసి కొనియెదంగాక. పోరుతొందరలో వాని మాట విమర్శించుటయు దటస్తించదు అని వారందఱు నాయుద్ధవార్తలగురించి ముచ్చటింపుచు నారేయిఁ గడిపిరి.

మఱునాఁడు శార్దూలుం డరుదెంచుటయు నంతఃపురకాంతలెల్లవాని మూఁగికొని యుద్ధవార్తలు చెప్పుము చెప్పుము. మనవీరుఁడు విజయమందెనా? ప్రతివీరుఁడేమిజేసెను? విభీషణాది మహావీరులు మూర్ఛదేలిరా అని అడిగిన వాఁడిట్లు చెప్పందొడంగెను.

దేవీ మీరు విచారింపవలదు మనకు విజయము గలిగినది. మీకొఱకే వచ్చితిని. విభీషణాది వీరులందరు మూర్ఛనుండి లేచిరి. కోట మనకు స్వాధీనమైనది అని