పుట:కాశీమజిలీకథలు -07.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భుజగాసురుల యుద్ధము

135

అతని యెదుట మన మంత్రి నిలువలేక నేలంబడియెను తరువాతఁ జిన్నవిభీషణుఁడు కలియంబడిన వారికి ముష్టా ముష్టి యుద్ధము జరిగినది. రెండు గడియలు సమముగాఁ బోరెను వజ్రకంఠాది దనుజులు సింహనాదములు సేయ నంతలో నాసేనాధిపతి నేలఁబడద్రోసెను. మనుమని పాటుజూచి విభీషణమహారాజు మిగులఁ గోపించుచు నిలునిలుడాని యదల్చుచు గదఁచేబూని సింహనాదము గావించుటయు మాతంగంబు మీది కుఱుకుసింగంబు చాడ్పుననార్చుచు దురగంబు డిగ్గనురికి గదబూని యమ్మహారాజుతో గలియఁబడిగదా యుద్ధము చేయదొడంగెను.

భీమదుర్యోధనులకుంబోలె వారిద్దరికిఁ బెద్దతడవు గదాయుద్ధము జరిగినది. వారి సంగరనైపుణ్యము జూచి దేవత లచ్చెరువుజెంద దొడంగిరి.

తప్పించుకొనుటయు దాటుటయు నురుకుటయు నొగ్గుటయుఁ దగ్గుటయుఁ దిఱుగుటయులోనగు లాఘవంబుల నొకరునొకరు మించిపోరాడిరి. దేవదానవులయుద్ధము లనేకములు చూచి యారితేరిన విభీషణమహారాజుగారితో నల్పప్రాయముగల నావీరుండు సమముగాఁ బోరుటఁ జూపరకు వింతదోపక మానదు.

అట్లు పోరుచుండ గొంతవడికి మన రాజుగారి దెబ్బలు తబ్బిబ్బులు కాఁజొచ్చినవి అయ్యంతరమరిసి‌ యవ్వీరుండు దారుణ గదా ఘాతంబునఁబీడితుంజేసి మీ తాతగారిని‌ మూర్ఛనొందించెను. అప్పుడు మన సేనలో హాహాకారములును, శత్రు సేనలలో జయజయ ధ్వానములును నింగిముట్టినవి.

అవ్వీరుం డంతటితో యుద్ధవిముఖుండై యవ్వలికిఁబోవుటచే మనసేనలందు నిలువంబడియున్నవి. కాకున్న నీపాటికి లంకాపురిజేరవలసినవే. మనరాజు మూర్ఛ దేరునంతలో లంకాపురి బ్రవేశించి దేజోవతి మొదలగు నాగకాంతలంజెరబట్ట వజ్రకంఠాది దానవుల సహాయమునఁ బారిజాతుండుఁ ప్రయత్నము జేయుచున్నట్లు గూఢచారులవలనం దెకిసికొనిప్రహస్త పుత్రుండీ పత్రికనిచ్చి నన్ను మీ యొద్ద కనిపెను. ఇవియే యుద్ధవిశేషములని చెప్పుటయుఁ జంపకశోకాక్రాంత స్వాంతయై పరితపించుచు తేజోవతి కత్తెరంగెఱిగింపుచున్న సమయంబున మఱియొక సందేశహరు డరుదెంచి యొక పత్రిక నారాజపుత్రిక కిచ్చెను. ఆమె తత్తరముతో నాయుత్తరమువిప్పి యిట్లు చదివినది దేవీ ! మీరు శుద్ధాంతముల విడిచిపోవనక్కరలేదు. శత్రువుల రాయిడి యుడిగినది. మనకు విజయసూచనలు గనంబడుచున్నవి. అంతయు నీశార్దూలుం డెఱిగించును. అనియున్న జాబుచదివి యుబ్బుచు నోరీ శార్దూలా ! మనవారుమూర్ఛ నుండి లేచిరా? శత్రువులేమిటికి బారఁదొడంగిరి. యుద్ధక్రమం బెఱిఁగింపుమని అడిగిన వాఁడిట్లనియె.