పుట:కాశీమజిలీకథలు -07.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భుజగాసురుల యుద్ధము

133

లంబ - ఆవివరమంతయు నాకుఁ జెప్పలేదు. కాని మహాబలశాలియగు పెద్దవిభీషణుఁడే మడిసినప్పుడు తక్కినవారి లెక్కయేమి? పోనీ మంచిపని జరగినదిలే.

దీర్ఘ - అవును మనల కడుపులు మాడ్చుచున్నందులకు మన యుసురు తగులక మానునా? తప్పక వాఁడు చావవలసినదే.

లంబ - ఇఁక మనము నిరాటంకముగా మనుష్యమాంసము తినవచ్చును. మద్యము త్రాగవచ్చును. యధేష్టముగాఁ దిరుగవచ్చును. ఇంకను వెల్ల డింపకుము.

దీర్ఘ - ఆహాహా! మద్యమాంసములు పేరు చెప్పినంత నానాలుక నూరు గజములు పెరిగినది చూడుము. వజ్రకంఠా?? రాక్షసజాతికెల్ల నుపకారము చేసితివిరా ! (అని గంతులు వైచుచున్నది )

లంబ -- అయ్యో? కేకలు వేయకుము భుజించుచు నెవ్వరికి జెప్పవలదని సంక్షేపముగా నాకొడుకు నాకీమాట జెప్పెను. వాఁడు వినినఁ గోపించును ఇంతలో నాగలేకఁజెప్పితిని.కొడుకు లేచువేళయైనది. పోయివచ్చెదను.

అనిచెప్పి లంబకర్ణిక యింటిలోనికిఁ బోయినది. అంతలో దీర్ఘ జంఘుఁడు భుజించి యాపత్రికం దీసికొని అమ్మా ! నేను చంపక యంతఃపురమున కరిగివచ్చెదను నేనన్నమాట యెవ్వరికిం జెప్పకుమీ! యని పలుకుచు నతివేగముగా శుద్ధాంతమున కరిగెను

అప్పుడు చంపక కలభాషిణితో నిట్లు సంభాషించుచున్నది. దేవీ నీవాపురుష సింహునితోఁ బెద్దతడవుమాట్లాడితివి. మేము మాటుననుండి యాకర్ణింతిమి. కొన్ని వినంబడలేదు. అతండెవ్వఁడు? ఇక్కడికెట్లు వచ్చెను. వానితోఁ గులశీలాదుల గుప్తము గావించితినని చెప్పుచుంటివి ఇప్పుడు మాకుఁ జెప్పక తీరదని అడిగినఁ గలభాషిణి యిట్లనియె.

యువతీ! యెఱింగించెద వినుము. ఈతండు జయసింహుఁడుకాడు.వీరసింహుఁడు. విక్రమార్కు ప్రసిద్ది మీరు వినియేయుందురు.ఆతనిమనమఁడు విజయభాస్కరుని కిద్దరము భార్యలము. పెద్దది హేమప్రభ రెండవదానిని నేను. నాపేరు కలభాషిణి యండ్రు. వీఁడు హేమప్రభ కొడుకు. హేమప్రభ వృత్తాంతము మీకునుఁ దెలిసియేయుండును. ఆమె రాక్షస వంశజాతయే అని యాత్మీయ వృత్తాంతమంతయుఁ జెప్పినది. ఆకథ విని చంపక యుబ్బుచు హృదయంబునం బొడమిన సంతసము దెలియనీయక చామరికతో సాభిప్రాయముగా నేదియో చెప్పినది. అప్పుడు తేజోవతి వారియొద్దకు వచ్చి యుద్ధవార్త లేమైనందెలిసినవియా చారులెవ్వరు రాలేదుగదా అని పలుకుచుండ