పుట:కాశీమజిలీకథలు -07.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లోకమా ! వైకుంఠమా యని తలంచుచు వీరసింహుఁడు తాను వచ్చిన పనియేదియో మరచిపోయెను. చూచినవింతయే చూచుచుఁ బోయినచోటునకే 'పోవుచునాలుగవ వాకిలియందుఁ బరిభ్రమించుచుండఁ నింతలో విభీషణుఁడు బలిచక్రవర్తి దర్శనముజేసి తిరిగి వచ్చుచుండం గాంచి ప్రహర్షము జెందిమఱి లోపలికిఁ బోవక యతనితోఁగూడి సేనానివేసము చేరెను. మొదటిద్వారమునందు మునుపు గనంబడిన వైష్ణవులెవ్వరు గనంబడలేదు.

అప్పుడు వీరసింహుఁడాత్మగతంబున బలిచక్రవర్తి ద్వారము మహావిష్ణుండు గాచుచున్నాడని పురాణములుచెప్పుచున్నవి. నాచేయి పట్టుకొనినవైష్ణవుఁడు జగదీశ్వరుఁడైన నారాయణుఁడు కాడుగదా. అవును సందియమేలా? బరులకదృశ్యుండనగు నన్నుఁ దెలిసికొనుట వశమా! ఛీ! ఛీ! నేను వట్టి మూర్టుండ. దర్శనమిచ్చినను దెలిసికొనలేకపోయితిని. నేనువట్టిపాపాత్ముడనని పశ్చాత్తాపము జెందుచుండ నింతలో దళంబులు రాజు నానతి పయనము సాగించుటయు వీరసింహుఁడు వారితోఁకూడ భోగవతీనగర ప్రాంతదేశమునకరిగెను. అనియెఱింగించెను.

121 వ మజిలీ.

భుజగాసురుల యుద్ధము

లంబకర్ణిక - దీర్ఘ జిహ్వికా ! యిటురా ! చెవులో మాట! నీకు మంచి యేకాంతము జెప్పెదను

దీర్ఘ జిహ్విక - ఇక్కడనుండఁగ జెప్పవచ్చును. ఎవ్వరివినకుండక నాలుక అడ్డము పెట్టెదనులే. చెప్పుము.

లంబ - ఇఁక మనలంకకు రాజు వజ్రకంఠుఁడగునఁట వింటివా?

దీర్ఘ - ఎట్లు విభీషణమహారాజో.

లంబ - వానిపని‌ యైనదఁట. యిప్పుడే నాకొడుకు దీర్ఘజంఘుండు పాతాళము నుండి యొకజాబు తీసికొనివచ్చెను. భుజించి చంపక యొద్దకు బోవును.

దీర్ఘ - ఆ జాబులో నేమనియున్నది?

లంబ - (మెల్లగా) వభీషణుం డాయుద్ధములో మూర్ఛపోయినాఁడని చెప్పినాఁడు కాని అది చావనియె తలంపవలయును. అంతఃపురకాంతలనెల్ల బారిపోయి మానములఁ గాపాడుకొనవలయునని జాబులోనున్నదఁట చావుకానిచో నట్లు వ్రాయుదురా?

దీర్ఘ - మఱి చిన్నవిభీషణుఁ డేమయ్యెను? తక్కిన రాక్షస వీరులందరు మడిసిరాయేమి?