పుట:కాశీమజిలీకథలు -07.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లతోఁ బరిభవించెదను. నిన్న నీ కోడలితో శపధము జేసియుంటిని నా సోదరుఁ డెందో చిక్కుపడియున్నవాఁడు. కాకున్న గౌరవ్యునికి యాపద రానిచ్చునా ? విభీషణ బలంబులతోఁ బాతాళమున కఱిగెద అనుజ్ఞయిమ్ము దీవింపుము. నా సోదరుని వెదకిఁ తీసికొని వచ్చెదనని పలికిన విని యా యిల్లాలు నిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె.

పుత్రా ! నీవాసంగరమునకుఁ బోవలదు. మహావీరుఁ డెవ్వడో. శత్రుపక్ష పాతియై పోరుచున్నవాఁడట. సురా సురులు వానింగెలువఁ జాలరని చెప్పుకొనుచున్నారు. జయాపజయంబులు దైవాయత్తములు వంశా౦కురమైన నీవి౦టికిఁ బోయి రాజ్యమేలుకొమ్ము. రాక్షస మాయలు కడు విపరీతములు మనుష్యులకుఁ దెలియవు. రామభక్తాగ్రేసరుండీ విభీషణుండు కౌరవ్యుని విడిచిపెట్టఁడు. ఎట్లో వానికి రాజ మిప్పింపక మానఁడు. మాగతి యేమగునో తరువాత‌ విమర్శింపవచ్చును. నీవుగూడఁ జిక్కుపడనేల ? జయసింహుఁడు బ్రతికియుండెనా సంతసముతో నెప్పటికైన నింటికివత్తుము లేకున్నఁ జెప్పవలసినదేమియున్నది. అని కన్నీరు స్రవింపఁ బలికిన విని వీరసింహుఁడిట్లనియె.

తల్లీ! నీవు వీరమాతవైనను నాయందుఁగల వాత్సల్యంబున నిట్లను చున్నావు. ఆ వీరుఁడు కాదు దేవాసురులు వచ్చినను నేనవలీల గెలువఁజాలుదును. నీవు సందియ మందవలదు నన్ను దీవించి యంపుము. నీవు దుఃఖింపకుము. మనకు మంగళము గలుగు నిమిత్తములు బొడజూపుచున్నవి. అని ప్రార్థించిన నారాజపత్ని బాష్పములచే అతని శిరము దడుపుచు గ్రుచ్చియెత్తి శిరము మూర్కొని విజయమందుమని దీవించి యంపినది.

విభీషణుండు చతురంగ బలములతోఁ గూడికొని పుత్రుండు చిన్న విభీషణుండు సర్వ సేనాధిపత్యము వహింపఁ బ్రహస్తాదిమంత్రులు సేవింప భేరీభాంకారములు రోదసీకుహరమునిండ దండు వెడలి దక్షిణముగాఁ బయనము సాగింపుచుండ వీరసింహుఁడు వానితోఁ గలిసికొని నడుచుచుండెను.

ఆ బలములు దక్షిణముగాఁ బోయిపోయి యొక బిలంబునఁ బ్రవేశించినవి. అందుఁ గ్రిందికి సోపానములున్నవి. బలములన్నియు వాని వెంబడి అడుగునకు, బోవుచుండెను. పెద్దదూరము పోయిన వెనుక బిలావసానము గనంబడినవి అందొక పాషాణము కమ్మివలె నడ్డముగా వేయఁ బడియున్నది. దానిక్రింద నవకాశముగాని మఱియేమియునులేదు. రాక్షసులు పక్షులవలె నెగయఁ గలరు. కావున నారాతిపలక నుండి క్రిందికి దుమికి పాతాళమున కరుగుచుండిరి.