పుట:కాశీమజిలీకథలు -07.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17]

కలభాషిణి కథ

129

డవే ? యెట్లువచ్చితివి బాబూ ? నీపైఁ బడినవార్త యసత్యమా ? తండ్రీ అని లేచి వానిం గ్రుచ్చియెత్తికొనియెను. అప్పుడతండు తల్లీ! నేను జయసింహుడనుకాను వీరసింహుడ హేమప్రభానందనుండ నిన్నును మాతండ్రిని రక్కసుఁ డెత్తికొనిపోయెనని తెలిసి మీకొరకు దేశములు దిఱుగుచు నీలంకాపురమున కెట్లోవచ్చితిని. నా సోదరుని మరణవార్తనిప్పుడే వింటిని నేను నిర్భాగ్యుడ ? వానిం జాడలేకపోయితిని మాతండ్రి యెందున్నవాఁడు తల్లీ ! యెఱింగింపుమని యామెం గౌఁగలించుకొని వీరసింహుడు దుఃఖింప దొడగెను.

ఆవార్తవిని యామె యొక్కింతతడవు పుత్రశోకము మరచి యబ్బురపాటుతో నేమీ ? నీవు హేమప్రభపుత్రుడవా ? మానిమిత్తమై యిక్కడికి వచ్చితివా బాబూ ? నిన్ను జూచుటచే దుఃఖము పోయి యానందము గలుగుచున్నది పుత్రా ! మీతండ్రి జీవించియే యున్నారు. ఎందుండిరో తెలియదు. నా కిట్టి నిమిత్తములు గలుగుచున్నవి. వత్సా ! వీరసింహా ! రాజ్యసుఖంబులు విడిచి కష్టములకోర్చి మా నిమిత్తము దేశాటనము జేయుచుంటివా ! సామాన్యుఁడీ దీవికి రాఁగలఁడా ? నీ శౌర్య ధైర్యాదు లనన్య సామాన్యములే తండ్రీ?. నీ సోదరుఁడు అట్టివాఁడే. మీ యిరువురకు రూప సాదృశ్యమున్నది. వాఁడు చిన్నతనమునందే యుక్కు గలిగి పెక్కండ్రం జావమోదెను. అని తానుజ్జయినీపురంబు వదలినది మొదలు నాటిఁ తుదదనుక్ జరిగిన కథ యెఱింగించి పుత్రా ! వాని విద్యా సంపత్తియు సౌందర్యాతిశయము పరాక్రమ ప్రకారముజూచి తేజోవతి వరించినది. కౌరవ్యుండు నీ పద్మావతియు అంగీకరించిరి.

పారిజాతుఁడు వీనికతంబునఁ దేజోవతి తన్ను వరించినదికాదని యీసుబూని అతండు నిద్రించుచుండ గాలుసేతులు బిగియఁగట్టి నూతిలోఁ బారవేయించి చంపించెనఁట. ఇప్పడే యా వార్త వేగుల వారు దీసికొనివచ్చిరి. తండ్రి యని పెద్ద యెలుంగన దఃఖించుండెను.

అప్పుడతండామె కన్నీరు దుడుచుచు అమ్మా ! నీవు శోకింపకుము. నా సోదరుఁడును దైవబలము గలవాఁడు. మా తండ్రిగారి నిశ్చయ ప్రకారము మరణ మకాలమున గలుగదు నూతిలోఁ బడినను దప్పించుకొని బ్రతుకవచ్చును. అదియునుం గాక వేగులవాండ్రు దెచ్చువార్తలన్నియు సత్యములుగావు. శత్రువులను వంచించుటకై రాజు లసత్యవార్తలఁ బ్రకటింతురు. మనకుఁ బరమోపకారియైన కౌరవ్యుండు శత్రుహస్తగతుండై యాపదజెందియున్నవాఁడని తెలియుచున్నదిగదా ? నేనిప్పుడుపోయి ఆతని చెరవిడిపించెదను. ఏలాపుత్రునిఁ బుత్ర మిత్ర కళత్రాదు