పుట:కాశీమజిలీకథలు -07.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలభాషిణి కథ

127

గూఢచారినై పాతాళలోకమంతయుఁ దిరిగితిని. జయసింహునిగురించి వితర్కించితిని వినుండు జయసింహుని తేజోవతివరించి తన్నవమానపరచెను కోపముతోఁ బారిజాతుండు కొందఱ రాక్షసుల సహాయంబున నొకనాడు నిద్రించుచుండ జయసింహుని బట్టుకొని యొడలెల్ల గట్టి యొక పాడునూతిలోఁ బడవైచి చంపించెనని తెలిసినది. హర హరా"? యెంత ఘోరకృత్యయు గావించెనో వింటిరా? అట్టివానిఁ బుత్రమిత్ర కళత్ర యుక్తముగా నాశనముజేయక తీరదని చెప్పి యవ్వలకుఁ బోయెను. అని యెఱింగించిరి.

120 వ మజిలీ

కలభాషిణికథ

ఆహా ! నాపురాకృత భాగధేయము ఫలించినది చంపక చామరికతోఁ జెప్పిన మాటలు వినుటచే నేను గృతార్థుండనైతిని నన్ను జూచి జయసింహుడు తేజోవతి భ్రమపడినది జయసింహుండు నా పోలికగా నున్నవాఁడుకాబోలు. అతండు మదీయ సోదరుఁడు కాడుగద. అట్టిభాగ్యము నాకు భట్టునా? నన్నీ లంకాపురమునకుఁ దీసికొనివచ్చిన భగవంతుని యె త్తికోలు ఎవ్వనికిఁ దెలియును. ఎట్లయినను నేను బాతాళలోకమున కరుగవలయుంగదా? విభీషణుఁడు నేఁటి రాత్రియే దండయాత్ర వెడలుటకు నిశ్చయించుకొనియెను. వారితోఁ భోయెదంగాక. అంతదనుక మఱియొకచోట నుండ నేల? చంపక యంతఃపురమునకుఁబోయి వారి సంభాషణ మాలింపుచుఁ గర్ణపర్వము గావించుకొనియెదను. అని తలంచి వీరసింహుఁడు ద్వారపాలురఁ దప్పించుకొనుచుఁ జంకక యంతఃపురమున కరిగెను.

అప్పుడు శుద్ధాంతమంతయు హల్లకల్లోలముగా నుండెను. హా! జయసింహా హాపురుషసింహా? సింహకిశోరములభాతి నురుగులనడుమఁ బ్రకాశించుచుందువు. నీకీ మృత్యువు విధియెట్లు విధించెనురా? దుర్మతీ? పారిజాతా? వానిం జపించినంతనే నిన్ను వరింతుననుకొంటివిరా? నాకుఁగూడ వానితోడిద గతియనియెఱుంగవు. అమ్మా ! ఇఁక బ్రాణములతోఁ బనిలేదు సఖీ! చంపకా! నాబ్రతుకు నేఁటితోఁ దీరినది దుఃఖింపుచుండ జంపక తేజోవతీ! యారడిల్లుము. ఆమాట సత్యమో యసత్యమో విచారింపక నక్కరలేదా? నిన్న మన యంతః పురమునకు వచ్చినవాఁడు జయసింహుఁ డననాయని యోదార్చిన నామె యిట్లనియె.

సఖీ! రూపసాదృశ్య మున్నది కాని స్వరభేదము గలుగుటం బట్టి మొదటనే సందేహించితిని. అతండు జయసింహుఁడుకాఁడు. నాలుగు నెలలనుండియుఁ గనం