పుట:కాశీమజిలీకథలు -07.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ప్రత్యూ — మహాభిషుండు పుడమి నెవ్వఁడై పుట్టునో ? వెండియు నాకంబుకు వచ్చునా?

ధరుఁడు — అతఁడు ప్రతీపుఁడను మహారాజునకు నందనుండై శంతనుండను పేరుతో బుడమిఁ బెద్దకాలము పాలించి వెండియు స్వర్గమునకు రాఁగలడని నారదుని వలనఁ దెలిసినది.

అహ్నుఁడు — పోనిండు. వారికదియు నొక వినోదముగా నుండును. కొంత కాలములో కాంతర విశేషములందెలిసికొని రాఁగలరు.

అనిలుఁడు — ఆహా! మన విమానము లెంతలో నెంతదూరము వచ్చినవో చూచితిరా! మనయెదురఁ గన్నులను మిరుమిట్లు గొల్పుచున్న పర్వతంబు మేరువుసుఁడీ?

సీ. పవలు రేల్గాఁగనే యవిరాజు నవిరాజు
            లలయక పలఁగొందు రనుదినంబు
    గరిమ దీపించునే గిరికోటి శతకోటి
            గిరికోటి గఱులఁ జెక్కినవిభుండు
    సాధింపనే మహాచలముతోఁ జలముతోఁ
            గలహించి వింధ్యాద్రి ఘనతఁబాసె
    హరియించెఁ ద్రిపురకర్బురగోత్రమే గోత్ర
           మునుఁ జాపముగఁజేసి మును శివుండు

గీ. దేవతాద్వంద్వసంచార దీప్తభూరి
    కందర భ్రాజితంబేనగ ప్రధాన
    మట్టి మేరుగిరీంద్ర మీయదితనర్చు
    సకలవిష్టవధూర్వహ స్థంభమగుచు.

ద్రువుఁడు - మన మనోరధముల ననుసరింపకయే యీ రధములు మేరు పార్శ్వమున కరుదెంచినవేమి?

ధరుఁడు — నేనట్లు తలంచితిని. మేరుపాద భూభాగము లతి మనోహరములని విందుము, చూడంబోవలదే ?

సోముఁడు — ఇది యేలోకము?

ధరుఁడు - భూలోకమనియే చెప్పవలయును.

ప్రభాసుఁడు — ఆహా! సౌరభేయి భూలోక విహారము సేయుచున్న దాయేమి. ఆ తోట మధ్యంబున అటుచూడుఁడు.