పుట:కాశీమజిలీకథలు -07.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసువుల కథ

11

ఉ. ముద్దులుమూటగట్టు పెనుమూపు సమానములైన శృంగముల్
     దిద్దినయట్టులొ ప్పెఁ ప్రథదేరెడు కన్గవ చారువాలమున్
     బెద్ద నిగారపుంబొదుగు పేరురము న్మెఱపైన పాదముల్
     తద్దయుఁగ్రాలఁగా నిడి శతక్రతుధేనువుగాఁ గనంబడున్.

అనలుఁడు — అవ్వన మొకానొక మహర్షి యాశ్రమం బని తోచుచున్నది. అందు సంచరించు నామొదవు హోమధేనువుగావచ్చును. చూడుఁడు.

శా. గోవుల్ గంఠములెత్తి హాయిఁగొన నాకున్ గంగడోలు ల్బులున్
    గ్రీవాభంగముగాఁగ సింగములు లంఘించు న్గరుల్వెంటరా
    ద్రోవల్జూపుచు నాడు ఛాగములతోఁ తోడేలు సారంగముల్
    బ్రోవుల్‌గా నదె యాటలాడుశరబంబుల్ మ్రోలనీక్షింపఁగా.

ప్రత్యూ - అవును. తపోధన ప్రభావంబునం గాని జాతివైరంబుల విడచి మృగంబు లిట్లు మైత్రిమై సంచరించునా? ఇది యేమహర్షి యాశ్రమమో?

ప్రభా — ఏదియైన మనకేమి. స్వాదుమూలఫలోదకం బగు నివ్వనమందుఁ గొంతసేపు విహరించి పోవుదము రండు.

ధ్రువు - మేరుగిరి పరిసరమునుండి ప్రవహించు సెల యేరుల కాలువలు కసక సైకత మిళితములై తరుమూలములనుండి ప్రవహింప నెంతేని దర్శనీయంబై యొప్పుచున్న నీయుపవన విశేషంబులు తప్పక జూడఁదగినవే.

ధరుఁడు — తమ్ములారా! యిది మహర్షి యాశ్రమంబని తెలిసికొనియు నిందు విహరింపఁ బ్రయత్నించు చున్నారేమి? తాపసుల కోపమునకుఁ బ్రతిహతము గలదా?

ప్రభా - సర్వభోగత్యాగం బొనరించిన యోగులిట్టి వినోద స్థానముల వసించుట డాంబికముగాక వైరాగ్య ప్రవృత్తియే? మన విహారములు వారికిఁ బ్రసాదకారణములు గాక యహంకార హేతువులగునా?

ప్రత్యూ — అనిమిషకృపాకాంక్షులైన పారికాంక్షులు మనల నాశ్రయింతురు గాని యాగ్రహింపరు. ఇందు విహరింతము రండు.

ధరుఁడు — పుష్పాసచయాది క్రీడలు గావింపక యూరక యాతోట చూచి రావలయు నట్లైనఁ బదుఁడు.

అని యొండొరు లాలోచించుకొని యవ్వసువులు విమానము లాకసమున నిలిపి భార్యలతోఁకూడ అయ్యాశ్రమమునఁ బ్రవేశించిరి.

సీ. వంచి కొమ్మలకు నెక్కించి కొమ్మలనుంచి
           మంచిపండులను గోయించి మేటి