పుట:కాశీమజిలీకథలు -07.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరిదాసు కథ

125

కావున నీయాపద మీరు దాటింపవలయును. మీశిష్యుఁడైన హరిదాసుం బంపితిరేని వాఁడు శత్రువులఁ బీచమడంపఁగలడు. వీఁడు అసహాయశూరుండు మీమాట జవదాటువాడు కాడు మేమెల్ల మీయానతి వానికి వశవర్తులమై యుంటిమిగదా? యీ సహాయము చేయుఁడనని వేడిన నాయోగి యించుక యాలోచించి సరియే మీరుపొండు వానికిం జెప్పి నాయోపిన యుపకారము గావించెదనని యూరడించి వారినంపెను. సహజకృపాపారీణులు పరహృదయ కాపట్యముల లెక్క సేయరుగదా?

హరిదాసు తనచెంతకు వచ్చినతోడనే యోగి వానిం జేరబిలిచి వత్సా! నీవు నేఁడు నాకొక యుపకారము గావింపవలసివచ్చినది నీవు స్వార్థపరుండవు కావు. పరోపకార పారీణుఁడని యెంచి యీమాట జెప్పుటకు సాహసించితిని అప్పని నీమది కొప్పమియగునేమోయని వెరచుచున్న వాఁడనని సందియమందుచుండ నాహరిదాసు ఇట్లనియె.

స్వామీనిన్ను గురువనియుఁదండ్రియనియు నొడయండవనియుఁ దలంచి మీ సేవజేయుచుంటిని మీకుఁ శిష్యుఁడ ఇట్లు చేయుమని నాకు విధింపక నాకుఁ బని చెప్పుటకు సందేహపడుచుంటి రేమటికి?

గీ. అగ్గిబడమన్నఁ బడియెద నంబురాళి
    మునుఁగుమన్నను మునిఁగెద మోహముడిగి
    తోడువిడిచెద నెట్టిబంధువులనైన
    యోగినత్తమ? నీవాజ్ఞ యొసఁగెదేని.

మహాత్మా ! తొల్లిదండ్రి నానతి బరశురాముండు తల్లిని జంపెను. శ్రీరాముండు సంసిద్ధంబైన రాజ్యలక్ష్మిని విడిచి అడవులం జరించెను. గురునాజ్ఞనుదండకాదిమహర్షులు ప్రాణంబులర్పించుటకు సిద్ధపడిరి నీతివిదులై న సేవకుల యజమానులమాట నెట్టి యకార్యకరణంబులనైనగావించిరి. కావున మీరు నావిషయమై సంశయింపవలదు. సత్వరమ కావించి మీదయకు, బాత్రుండయ్యెదనని శపధముజేసెను.

యోగి వానిమాటలు మెచ్చుకొనుచు వత్సా! నీకు ధండన మనినఁబండువుగదా? ఈరక్కసుల మిత్రులకు శత్రువులఁ వలన నుపద్రవము వచ్చినఁదట దానివారించి వీరికి జయము గలిగింప వలయునిదియే నేచెప్పుపని యనుటయు హరిదాసు ఓహో! యింతమాత్రమునకే నన్నింతగాఁ బలికితిరి నాకు వీరెవ్వరు సహాయము రానక్కర లేదు. వారిం బేర్కొనమనుఁడు ఇప్పుడే వశవర్తులం గావించెదనని పలికెను.

యోగి వజ్రకంఠుని రప్పించి అతనిచేయి హరిదాసు చేతిలోఁబెట్టి ఈతని నీవు మిత్రునిగా భావింపుము అత్తెరంగు వీఁడెఱింగించును. వీనితోఁబోయి ధర్మవిజయము గైకొనిరమ్మని నియమించెను.