పుట:కాశీమజిలీకథలు -07.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మంతయు నాలుగు దినములలో శూన్యము జేయక పోవుదునా? నీకతంబున నీక్రూరుల కెల్ల నభయహస్త మిచ్చితిని వెరపుడిగి సంచరింపుమని చెప్పుడు ఇఁక దారుణకృత్యములు విడిచి వర్తింపుమనుఁడు విడువకున్న మడియఁజేయక మానను. నేను మీకడ వసించెద మంచిమాటల నుపదేశింపుఁడని ప్రార్థించెను.

ఆయోగి హరిదాసుని మిక్కిలి మెచ్చుకొనుచు వత్సా ! నీవు జీవులకు సర్వోత్కృష్టమైన ప్రాణదానం బొసంగితివి. కావున నీకు నే దాసుండనైతిని. భూతదయకలవాఁడే నాఁకు జుట్టము దేహములు క్షణభంగురములు నీటిబుడ్గ వోలెఁ బ్రతిక్షణ వినాశియగు నీ దేహ సుఖమునకై జీవహింస జేయవచ్చునా? వీండ్రు క్రూరులగుట నిజమే. సృష్టి వైచిత్రము కడువిపరీతముకాదా ! గోవుల సాధువులఁ జేసి వ్యాఘ్రంబుల ఘాతకంబుల జేసినట్లే భగవంతుఁడు అసురుల ఖలులం గావించెను. అది భగవంతుని తప్పుగాక వారిదికాదు. వృశ్చికపుచ్ఛంబు విషపూరితము కాకున్న నది కుట్టినను బాధ యేమియున్నది. సహజ గుణంబులు మానుప నెవ్వరితరము? లోక ప్రకృతి తెలిసి వర్తింపవలయు నని యుపదేశము చేయుచుండ నాహరిదాసు కొన్ని దినములా యోగివద్ద వసించి శిశ్రూషజేయుచుండెనఁట.

మఱియొకనాఁడు హరిదాసు దాపునలేనప్పుడు వజ్రకంఠుఁడు యోగియొద్దకు వచ్చి పాదంబులంబడి మహాత్మా ! మీదయ వలన మేము తలాతలంబున నిర్భయులమై సుఖించుచుంటిమి. నీతియందు శుక్రాచార్యుండు నీ కెనగాడు. ఇప్పుడు మాకుఁ బ్రాణసంకటమైన యుపద్రవ మొండు సంభవించినది. అది తప్పించుకొన మాకుశక్యముకాదు. నీవు మమ్ము రక్షించెదనని యభయహస్తమిచ్చు దనుక నీపాదము విడువనని మిక్కిలి దీనుఁడై ప్రార్ధించెను.

కృపాళుండగు నాయోగి వానిమాటలు విని జాలిపడి రాక్షససత్తమా? లెమ్ము లెమ్ము నీకువచ్చిన యుపద్రవమేదియో యెఱింగింపుము. తెలిపితివేని తీర్చెదనని పలికిన స్వామీ? మీపనివారుకారు మీరు తలంచుకొనిన నింద్రుఁడు వచ్చి దాస్యము చేయఁగలఁడు మీరు మాకు నభయదాన మొసంగితినని శపథము చేసినం జాలు మా కార్యమైనట్లు తలంతునని కన్నీరు గార్చుచుఁ వాక్రుచ్చిన మెత్తని మనసుగల వాఁడగుట నావిరాగి యందుల కంగీకరించి శపథము గావించెను.

అప్పుడు వాఁడు పాదములనుండి లేచి స్వామీ ! వినుండు ఇప్పుడు నాబంధువులు శత్రువులతోఁ బోరాటము గావింపుచు నోడి పోవుచున్నారు నన్నుసహాయము రమ్మని కోరిరి. శత్రువులు బలవంతులగుట నేను దోడుపడినను వారిం జెనక జాలను. ఇప్పుడు పేక్షించితినేని బగతు రిచ్చటికిఁగూడవచ్చి మారాజ్యము లాగికొందురు.