పుట:కాశీమజిలీకథలు -07.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరిదాసు కథ

123

పంపుటయు వాండ్రు గాండ్రుమని యార్చుచు నావీరుని పైఁబడి యగ్నింబడిన మిడుతలవలె మ్రగ్గిపోయిరి.

కృపాణపాణియై కృతాంతుని చందమున సుర విరోధుల మడియింపుచు వీధుల గ్రమ్మరుచున్న యా వీరపురుషుని నెదుర్కొన నాలోకములో నొక్కరుఁడు సమర్దుఁడు లేకపోయెను. అప్పుడు వజ్ర కంఠుఁడు విచారించి యాయోగి పాదంబులంబడి మహాత్మ ! ఈ మానుషయువకుం డెవ్వడో తెలియకున్నది శ్రీవిష్ణుండు మమ్ముఁ బరిభవింప నీరూపమున జనుదెంచెనేమో తెలియదు. సామాన్య మానవునకింత బలముగలుగునా? నిన్ను శరణుజొచ్చితిమి. రక్షించి వాని యుపద్రవము తప్పింపుమని ప్రార్దించిన నయ్యోగి యిట్లనియె.

దానవోత్తమా? ఆ వీరుఁడెవ్వడో నేనెఱుంగను. నామాట బాటించెనేని మీకుపకారము గావించెదను వాని నాయొద్దకనుపుఁడని చెప్పిన నారాక్షసరాజు ఆలోచించి కొందఱుగ్రవ్యాదులవాని నెదుర్కొన బంపెను. ఆదనుజులు వోయి పోరరమ్మని చీరి మీఁదఁబడవా రామఠముదారిం బారిపోయిరి.

ఆవీరుండు దారిలో మఠములో జపము జేసికొనుచున్న మహాయోగిం జూచి వెరగుపడుచు నోహో? మాలపల్లెలో హోమధేనువు వలె నిందీయోగి యెట్లు వసించెను. వీని యాకారము మహాసుభావత సూచించెడి. వీరితో సంభాషించి కృతార్థుండ నయ్యెదనని తలంచి యతఁడు మంటపములోనికిఁ బోయి యాయుధముల నేలబెట్టి సాష్టాంగ మెరగి యెదుర నిలువంబడియెను.

అప్పుడు యోగి వానిం జేరరమ్మని వీపుపై జేయివైచి దీవించుదు వత్సా! నీవెవ్వనికుమారుఁడవు ఇక్కడి కెట్లువచ్చితివి ఊరక‌ నీరక్కసుల బరిమార్చుచుంటి వేమిటికి? జీవహింస మహాపాతకముగదా? భూతదయవలదా? స్వార్థపరుని భూతములు శాసించును. శస్త్రధారణమున కిదియా ఫలము భీరువులఁ దరుముట వీర ధర్మమే? నీవాలించితివేని మంచిమాట లుపదేశించెద. హింసక్రియ నుపసంహరింపు మని పలికిన విని‌ అతండు చెవుల కమృతము శోకినట్లు మురియుచు నిట్లనియె.

మహాత్మా ! నీయుపదేశమున నాయుధముల విడిచితి. వీండ్రునన్ను బాధించుటచే నింత సేయవలసివచ్చెను నేనిక్కడి కెట్లు వచ్చితినో తెలియదు. నాతండ్రిపేరు నేనెఱుంగను. మాతల్లిదండ్రు లేదియు నాకు నామకరణము చేయలేదు. హరిదాసుండని పిలువఁబడుచుందును. ఇది యేదేశము? ఈక్రూరులనడుమ నీవెట్లుంటివి? అక్కటా? వీరిచర్యలు కడువిపరీతములు కావా? వీండ్రఁజాచిన నీకక్కటిక మెట్లు కలిగినదో తెలియదు. నీవు సహజదయాశాలివగుట తెల్లమైనది మీరాపకున్న నీలోక