పుట:కాశీమజిలీకథలు -07.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నది. అప్పుడు నేను మర్కట రూపము ధరించి తలాతలంబున కరిగితిని. బలిచక్రవర్తి కొన్ని యేండ్ల నుండి యోగంబవలంబించి బాహ్యప్రచారశూన్యుండగుటంజేసి రసాతలంబు నంగల రక్కసులు తలాతలమునకు నిరాటంకముగా రాకపోకలు జరిగించుచున్నారు. తలాతలముఖద్వారమున బలిచక్రవర్తి భటులనేకులు కాచి యుండు వారలు ఇప్పుడొక్కఁడైన నందులేడు. నేను నిర్భయముగా నా గుమ్మము గడచి లోనికిఁ బోయితిని? నేను తలాతల మెప్పుడును జూచియుండలేదు. చీకటిగా నుండునని వాడుకయేకాని పాతాళముకన్న నెక్కుడు తేజముతో నొప్పుచున్నది.

ఉరగ లోకమునందుగల రత్నములన్నియు దొంగిలించి రక్కసులు తలాతలంబున దాచికొనిరి. వజ్రకంఠుఁడు దానిని బాలింపుచుండెను. ఇఁక చెప్పనేల రాక్షసకృత్యము లన్నియు అందేయున్నవి. దయా సత్యశౌచముల పేరులక్కడి వారికిఁ దెలియవు. పచ్చిమాంసము తీసి రక్తము త్రావుచుందురు. ఆకలియైనప్పుడు తండ్రులను బిడ్డలను గూడఁ దెలియక భక్షించుచుందురఁట. అట్టి దుష్టలోకమున నెట్లో యొక యోగి వసియించి యుండెను. అతండొక మంటపము మీఁదఁ గూర్చుండి జపము జేసికొనుచుండును. వాని జోలికెవ్వరును బోరు వజ్రకంఠుఁడా యోగిమాట శిరసావహించును ఆ యోగికిఁగల భూతదయ యెవ్వరికిని లేదఁట. తన ప్రాణము గవ్వగానైనఁ జూడడఁట. పెక్కుసారులు రక్కసులు వానిం భక్షింపఁ దీసికొని పోయిరఁట. తినమని తన శరీరమిచ్చెనఁట. కాగిన యినుపకమ్మివలె నుండుటచే వాని దాకియాకితవులే సమసిరఁట.

అందున్న వారందరు నా యోగిమాటజవదాటరు. కౄరులైనను అందలి వారి నయ్యోగి పుత్రులుగాఁ జూచుచుండును. అతం డాహారమెప్పుడు గుడుచునో తెలియదు. ఎప్పుడును, కన్నులుమూసికొని జపము జేసికొనుచుండును. ఆ యోగి మహిమ సామాన్యముగాదు. కొన్ని నెలల క్రిందట చక్కని యొక మనుష్య కుమారుఁ డాతలాతలమునఁ బట్టణ వీధిలో నొడలు కట్టఁబడి పడియుండెను. వానింజూచి రక్కసులు సంభ్రమముతో మూఁగి నరమాంసము లభించెనని యుబ్బుచు వాని కట్టులు విప్పి పట్టుకొని నాదినాది అని‌ పలువురు పెనుగులాడఁ దొడంగిరి.

అప్పుడా కుమారుఁడు తెలివివచ్చి హస్తపాదములు విదిళించి వారినెల్ల ముష్టి ఘాతములఁ బారఁదోలెను. మఱికొందఱు వీరులు ఖడ్గపాణులై వానిమీఁదఁబడి యేయఁ బూనిరి. కాని వారి యాయుధముల లాగికొని వానితో వారినెల్ల బరిమార్చెను. అప్పుడు బెబ్బులిం గనిన మేకలవలె రక్కసులు వీధులంబడి పారిపోవఁదొడంగిరి. వజ్ర కంఠుండు వానిరాకవిని పెక్కండ్ర దానవీరుల వానిఁ గట్టి తీసుకొని రండని