పుట:కాశీమజిలీకథలు -07.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తేజోవతి కథ

119

కరించినది. సముద్రమునం దీదుచు నది పారవైచితిని. ఆ మణి యుండిన మాతండ్రి కవమానము గలుగకపోవును. దానిఁదాల్చినవారికి క్షుత్పిపాసలుండవు. అంతయుఁ దనకుఁ గనంబడును. తానెవ్వరికిఁ గనంబడఁడు. అట్టి దివ్యమణింగోల్పోయిన మా తండ్రికీ యవమానము తట స్తించినది. నాపెండ్లి మాట పిమ్మటఁజాచికొనవచ్చును. మాతండ్రి చెరవిడిపింపయత్నింపుమని ప్రార్థించినది. దివ్యమణి వృత్తాంతమంతయు బద్మావతి వలనం దెలిసికొని‌ చంపక దానిపోకకు విచారించుచు జయసింహుని కులశీలాదులఁ దెలిసికొంటివా యని అడిగినఁ బద్మావతి అడుగలేదు. ఆమెకూడ మాతోనేవచ్చినది. యిక్కడనే యున్నది. పిమ్మటఁ దెలిసికొనవచ్చును. ఈముప్పు దాటవలయుఁగదాయని పలికినది వారట్లు ముచ్చటించుకొనుచుండ వీరసింహుఁడ ల్లంత దవ్వున నివసించి వారిమాటలన్నియు వినెను. ఏవో కొన్నిమాటలు మాత్రము వినం బడలేదు.

తేజోవతియుఁ జంపకయు నొకచోటఁ గూర్చుండఁగ జూచి యిరువురసౌందర్య తారతమ్యంబుల నిరూపింపఁజాలక యిట్లుతలంచెను.

ఆహా ! సరస్వతీ ప్రాణనాధుని నిర్మాణకౌశల్యమునకు మేరలేదుగదా ? తేజోవతీ చంపకల నిరువుర నొకద్రవ్యంబు గరిగి యొక యచ్చున ముద్రించెనా ? సవిమర్శనముగా నెవ్వతెంజూచిన నాచిగురుఁ బోణియే యెక్కుడు చక్కనిదిగా దోచుచున్నది. ప్రాయంబుననించుక తేజోవతియే పెద్దదివలెఁ గనంబడుచున్నది. ఈ యిద్దరు ముద్దుగుమ్మలు సౌందర్యమునఁ బరమేష్టి సృష్టికిఁ గడపటివారని తలంచెదను. పారిజాతుండీ తేజోవతి కొరకు విరహాతురుండగుట నబ్బురముగాదు. జయసింహుఁ డెవ్వఁడో తెలియదు. తేజోవతిచే వరింపబడుటచే నదృష్టవంతుడనియే చెప్పదగినది. ఒకని వరించిన తేజోవతి చక్కదనముతో నాకు నిమిత్తములేదు. చంపకయే వరింపఁ దగియున్నది. చంపక నన్ను వరించిన నాకీగమనము సార్దకమగును. పాతాళలోకమంతయుఁ గౌరవ్యునికిఁ బట్టము గట్టుదును. అదృశ్యుండనై యిట్లు క్రుమ్మరుచుండ నేమిలాభము? ఇక్కడ తేజోవతియు, రేవతియు, జంపకయుఁ జామరికయుఁ దప్ప నితరులులేరు. పద్మావతి లోనికిఁబోయినది. వీరికిఁ గనంబడెదనని తలంచి యామణి గురుతుగా నొక గోడకొయ్యకుఁ దగిలించి ఖడ్గహస్తుండై యట్టె నిలువంబడియెను. తొలుత తేజోవతి అతనింజూచి అదిగొ జయసింహుడనిఁ కేకవై చినది. తోడనే చంపక చూచినది. పరిచారికలు చూచిరి. అప్పుడు రేవతి యాతనియొద్దకుఁబోయి జయసింహా! యిక్కడి కెట్లు వచ్చితివి? నాలుగునెలలనుండి కనంబడుటలేదేమి ? ఎందుబోయితివి ? యుద్ధములో నెట్లు తప్పించుకొనివచ్చితివి? ఇటురమ్ము మీతల్లియు నిక్కడనేయున్నది.