పుట:కాశీమజిలీకథలు -07.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

కాశీమజిలీకథలు - సప్తమభాగము

పరితపించుచున్నది. రాజ్యమంతయు నెట్లయినదో చూచితివా? యని పలుకుటయు నతండు వెరగుపడి యేమియు మాటాడక చూచుచుండెను.

చంపక వాని నెగా దిగఁ జూచి తలయూచుచుఁ జెల్లీ! నీ పురాకృతము పండినది. మంచివాని వరించితివి. రాజ్యముపోయినఁ బోవుఁగాక‌ వీనితో నెందై నం బోయి సుఖింపవచ్చును. ఇతఁడు మాయలంగూడ నెఱుంగునా యేమి? యీ శుద్దాంతమున కెట్లు వచ్చెను. కావలివాండ్రు రానిత్తురా? చామరికా ! నీవుపోయి వాని‌ కాతిధ్య మిమ్ము. అతిధిపూజ్యుఁడుగదా ! అని ప్రేరేపించుటయుఁ జామరికయం దొక పీఠమువైచి బలవంతమునఁ దోడితెచ్చి కూర్చుండ బెట్టినది.

చంపక యేదియో యనఁబోయియు సిగ్గునమాటరాక తేజోవతితో చెల్లీ! నీకేమి భయము? సహాధ్యాయుఁడు కాడా? పెండ్లియైన తరువాత సిగ్గుపడవచ్చునులే యెట్లు వచ్చెనో అడుగుము. మేమును వినియెదముగాక యని ప్రోత్సహించిన నమ్మించుబోణియుఁ గొంచెముసేపు వితర్కించి తెగువమై జయసింహా! మమ్మువిడిచి యెందుఁ బోయితివి? మేమాపదలఁ జెందియుండ జూడవచ్చితివా? చిన్నతనమునందే పదుగురఁ గొట్టిన నీపరాక్రమ మెందుదాచితివి? అయ్యో? యింత దయాశూన్యుండవై తివేమని పలుకుచుఁ గన్నీరు ధారగా గార దుఃఖింపఁ దొడంగినది. ఆఁబోటిమాటల కాతండు జాలిపడి కనుల బాష్పములు గ్రమ్ముదుడిచికొనుచు రమణీ ! నేను జయసింహుఁడనో వీరసింహుఁడినో యెవఁడినో యొకఁడను. ఎవఁడైననేమి?‌ మీయాపదఁదొలగింప శపధము చేయుచుంటి వినుము. పదిదినములలో శత్రువులనెల్లఁ బారఁదోలి పాతాళలోకమంతయు నేకచ్ఛత్రముగా నీతండ్రిచేత నేలింపకపోయితినేని నాపేరునంగల సింహశబ్దము తీసి మార్జాలశబ్దము ప్రయోగించి పిలువుము. అభయహస్తమిచ్చితిని. వెరవకుము అని శపథము చేయుటయు నాలించి తేజోవతి యాత్మగతంబున నిట్లు తలంచెను.

అయ్యో ? వీని కంఠధ్వని మఱియొకరీతిగా నున్నదేమి? వీఁడు జయసింహుఁడా? మఱియొకఁడా? మఱియొకఁ డిట్టి ప్రతిజ్ఞ పట్టునా? ఇన్నినాళ్ళెక్కడనుండెనో యడుగవలయును. ప్రాయోదయంబుఁ గ౦ఠస్వరము మారునందు రని తలంచుచు నెద్దియో చెప్పఁబోవు సమయంబునఁ గొందరు కింకరులు తొందరగావచ్చి విభీషణ మహారాజుగారు వచ్చుచున్నారు. పీఠములు సవరింపుఁడని పలికిరి.

అప్పుడు సంభ్రమముతో అందఱు లేచి యుక్తప్రదేశంబుల నిలువంబడిరి. ఆ యలజడిలో వీరసి౦హుడు లేచి తనహారము వెదకికొని మెడలో వైచికొని విభీషణుని రాక కెదురుచూచుచుండెను.