పుట:కాశీమజిలీకథలు -07.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

కాశీమజిలీకథలు - సప్తమభాగము

జదివింప నియోగించితిమి. అవును. కొన్నినెలలనుండి వాని జాడ తెలియదు. తెలిసికొనుడు అని పలికితిని.

అప్పుడే పరిజనులం బంపి బాఠశాల వెదకిఁ తీసికొనిరండని నియోగించితిని. వారు తిరిగి తిరిగి వచ్చి యెందునుఁ గానక దేవా! నాలుగునెలలనుండి జయసింహుఁడు పాఠశాలకు వచ్చుటలేదని యపాధ్యాయు లందఱు జెప్పిరి. యెక్కడికిఁబోయెనో తెలియదు గ్రామ మంతయు వెదకితిమి. వానిజాడ గనంబడలేదు. ఈ నడుమజూచితిమని చెప్పినవారు లేరని చెప్పిరి.

అప్పుడు మేము భయపడి కొన్నిదినములు మాదేశమంతయు వెదకించితిమి. కనంబడలేదు. తల్లికిఁ జెప్పిన శోకించునని యామెకుఁ దెలియకుండగనే వెదకించు చుంటిమి. ఇంతలో పిడుగులాగున నేలాపుత్రుని సందేశము హృదయభేదకరమై వినవచ్చినది.

తేజోవతిని దీసుకువచ్చి పారిజాతుని పాదంబులఁ బడవైచి రక్షింపుమని శరణు గోరవలెను. ఇందులకుఁ బదిదినములు గడువిచ్చితిమి. లేనిచోఁ బదునొకండవనాడు చతురంగబలములతో మీపురంబుపైఁబడి మిమ్ముఁ బరిభవించి నీపుత్రికం దీసికొని పోవుదుము. ఆయితముగండు. అని‌ మాపై యుద్ధమును బ్రకటించి యుత్తరము బంపిరి.

అందులకు శత్రులకేమియు బ్రత్యుత్తరమీయక పోరుటకు నిశ్చయించి నాభర్త నీతండ్రికా తెరంగెఱింగించి సహాయముగోరెను. రాక్షసబలంబులు పెక్కులు వచ్చిమాపురంబుజేరినవి. రెండు బలంబులకును ఘోరసంగరము జరిగినది. మొదట మనవారే వారింద్రోసికొనిపోయిరి. ఎవ్వఁడో మహావీరుఁడు వారికిఁ దోడువచ్చెనని తెలిసినది. వాని సహాయమునఁ గోట ముట్టడించి శత్రువులు కొటలోఁ జొరఁబడిరి. అప్పుడు రాక్షససేనాధిపతి వారియుద్యమము దెలిసికొని నాగకాంతలనెల్ల శత్రువుల బారి బడకుండ గుప్తమార్గంబున నిక్కడికిఁ దీసికొనివచ్చిరి. నా భర్తను దప్పించుకొని రమ్మనిన నొప్పుకొనక నందే పోరుచుండిరి. ఇదియే జరిగినకథ యుద్దకారణ మిదియే యని యావృత్తాంత మంతయు బద్మావతి చంపకకుఁ జెప్పినది.

ఆకథవిని చంపక మిక్కిలి యక్కజమందుచుఁ దేజోవతిని జూచి చెల్లీ ? నీవుల్లంబున బెదరకుము నీవల్లభుండైన జయసింహుని వెదకి తెప్పించి నీకుఁ బెండ్లి జేసెదను. అంతయు మాతాతగావించునని యోదార్చినది. అప్పుడు తేజోవతికన్నీరు గార్చుచు అక్కా ! ఈముప్పునకుఁ గారకురాలను నేనే నేగలుగకపోయిన మావారు సుఖింతురు. మాకులము పెద్దయగు వాసుకి శిరోమణి మాతల్లి చిన్నతనమున నాకలం