పుట:కాశీమజిలీకథలు -07.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లెల్ల విభీషణుని వంచించుకాలమెప్పుడైన వచ్చునాయని నిరీక్షించుచున్నారు. ఇప్పుడు మనము కోరినవారందరు మనకు సహాయము రాఁగలరు. మరియు లంకలోని రక్కసులలో నొక్కనికి మాయాపాటవము లేదు. అదియు విభీషణుఁడు జేసిన శాసనమే. మాయాచ్ఛన్నులై దనుజులు మనుజుల, వేల్పుల బాధింతురని యా రావణానుజుండు శాంబరీ గ్రంధాలయము మూయించెనఁట. కావున విభీషణుఁడు సహాయము వచ్చినను మనము సులభముగా జయింపవచ్చును. దేవర సెలవైనచో రక్కసులనెల్ల నిందు రప్పించెదనని యేమేమో బీరములు పలుకుటయు వేణీస్కందుఁ డిట్లనియె.

ఓహోహో? నీ నీతి వైదుష్యము స్తోత్రపాత్రమై యున్నది. మాటాడనేరని అబలయొకతె యేమో యన్నదని అలిగి దండు వెడలఁ బ్రయత్నించుచుంటివా ? మరియు విభీషణ పరాక్రమ మెట్టిదో నీ వెఱుంగుదువా ? ఆతం డేనాఁటివాఁడు. దేవాసుర సంగరంబుల నారి తీరినవాఁడు శస్త్రాస్త్ర బలసంపన్నుండు రసాతలదనుజులుగారు పదునాలుగు లోకములఁగల మహావీరులు గూడి వచ్చినను విభీషణు నెదురింపఁజాలరు. పోరువలదు సామంబునఁ బిల్లనీయమని కౌరవ్యునికి వార్త నంపుఁడు. అతం డీయకున్నఁ దరువాతఁ విచారించుకొందమని ధారాళముగా బలుకుటయు నేలాపుత్రుఁడు శింశుమారుని నప్పని కావింపుమని నియమించి వేణీస్కందుఁడు చెప్పిన వడువున మాకిట్లు జాబు వ్రాయించెను.

కౌరవ్యా ! నీవు పన్నగ కులావతంసుఁడగు వాసుకి వంగడంబున జనించితివి. కావున నీ వంశము కడు పవిత్రమైనది యురగలోకములోఁ గొంత దేశమున కధికారము గలుగుటచే ధనధాన్యముల విషయమై తెలియనవసరములేదు. విద్యాశీలంబులు నీకడ లేవనరాదు. కావున మాతో సంబంధము చేయుటకు నర్హుండవై యుంటివి. నీ కూఁతురు తేజోవతి వివాహవిధి కర్హురాలై యున్నదని వింటిమి. నా కుమారుడు పారిజాతునికరము గ్రహింపఁదగినదని తెలిసినది. కావున మే మంగీకరించి యీ శుభపత్రిక వ్రాయించితిమి. తదనుకూలముగఁ బ్రత్యుత్తరము వ్రాయుదువని నమ్ముచుంటినని వ్రాసి వార్తాహరునిచే మా యొద్దకనిపెను.

ఆ జాబు చూచుకొని నా భర్త వెరగుపడుచు నా యొద్దకు వచ్చి పొలతీ ? యేలాపుత్రుండెట్లు వ్రాసెనో చూచితివా? యెంత స్వాతిశయము ప్రకటించెనో గనుఁగొంటివా ? ఔరా? ఎంతకావరము ? పిల్లనడుగక నీ గర్వోక్తు లేమిటికో యని అసహ్యించుకొని జాబు నేలఁ బారవైచి అంతకుమున్ను జరిగిన చర్య లేమియు నెఱుంగఁడు కావున నిట్లు ప్రత్యుత్తరము వ్రాయించెను.