పుట:కాశీమజిలీకథలు -07.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఉ. అతనిఁ గూడినప్పుడెగదా? భవదీయ మనోజ్ఞ సుందర
    త్వాతిశయంబు స్తుత్యమగునం బుజపత్ర విశాలనేత్ర? త
    చ్చాతురి శ్రీతనూభవ వసంత జయంతులకైన లేదు ప్ర
    ఖ్యాతకళావిదుం డతని కాతఁడె సాటిసుమీ? వధూమణీ

అని మఱియు అనేక ప్రకారంబులఁ బారిజాతుని స్తుతియించుచుండ వినిపించు కొనక తన సఖి రేవతి కెద్దియో సంజ్ఞచేసినది. అప్పుడా రేవతి తేజోవతి యభిప్రాయము గ్రహించి హంసికతో నిట్లనియె.

హంసికా ? మీ పారిజాతుఁ డంతవాఁడగుట వాస్తవమే కాని తేజోవతిని గురించి విరహాతురుండగుట సమంజసముకాదు. తేజోవతియొక సుందరునిం బెండ్లి యాడ నిశ్చయించుకొన్నది. కావున మీపారిజాతుని చిత్తము మరలించుకొనుమని చెప్పుము. పోపొమ్మని పలుకుటయు హంసిక చిన్నవోయి మరుమాట పలుకక యధాగతముగా పోయి యావార్త వాని కెఱింగించినది.

అతండు విరహముకన్న అవమాన పరితాప మెక్కుడుగా భావించి యేమియుఁదోచక దుఃఖించుచుండెను. ఎట్లో తండ్రి తెలిసికొని వాని రప్పించి యేకపుత్రుఁ డగుట నూరడింపుచు నిట్లనియె.

పుత్రా ! నీవు పాతాళలోక చక్రవర్తి కుమారుఁడవు నీకే లోపమును లేదు. ఎందులకై నీవిట్లు కృశించి దుఃఖించుచున్నావు? నీకు మూడు లోకములలో దుర్లభమైన వస్తువులేదు. నిన్నెవ్వరేని అవమాన‌పరచిన వారిం బేర్కొనుము. ఇప్పుడు కోటముంగల వారి యంగములు తున్కలుగాఁ గోయించెదనని లాలింపుచు అడిగిన వాఁడు కన్నీరు దుడిచికొనుచు నిట్లనియె.

తండ్రీ ! నాయవమానమును వక్కాణింతును వినుండు. కౌరవ్యుని కూఁతురు తేజోవతి మిక్కిలి చక్కనిదఁట నాయొద్ద హంసిక యొకనాఁడు దానిరూపము పొగడుచు నీకాచిన్నది సరిపడియున్నది. పెండ్లి యాడెదవాయని అడిగినది. అర్ధాంగీకారము సూచించితిని. అదివోయి తేజోవతి సఖులతోఁ గ్రీడించుచుండ నా రూపము, నా వైభవము, నా సౌందర్యము పొగడుచు నన్నుఁ బెండ్లి యాడుమని యడిగినదఁట. తనకిష్టములేకున్న నామాట జెప్పిన లోక పరిపాటిగానుండును.

ఇస్సిరో పారిజాతుని సిరి మేమెఱుగనిదియా? వానిసౌందర్యాది గుణంబులు మాయొద్దఁ బొగడనక్కరలేదు. ఏలాపుత్రుని రాజ్యమెట్టిదో మేమెరుంగనివారము కాము. పారిజాతుండు గుణహీనుఁడు. విద్యాశూన్యుడు దరిద్రుఁడు కులముతక్కువ వాఁడు. మాఱేనిపుత్రికను వరింపదగినవాఁడు కాఁడు. ఇట్టి యసమానసంబంధమున