పుట:కాశీమజిలీకథలు -07.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15]

తేజోవతి కథ

113

తండ్రీ ! అందు జయసింహు నపరాధమేమియును లేదు. ఎంత శాంతమైనది యైనను సింహము తన కేసరముల లాగిన నూరకొనునా. నిత్యము మాయొజ్జలు పిల్లల చేత వీనిమానిసియనియుఁ గూలివాఁడనియు దాసీపుత్రుడనియుఁ బలికించుచు దనతోఁ జెప్పినను వినిపించుకొనక వారిని పురికొల్పెను. ప్రతిదినము దన్నాక్షేపించుచుండ సైపక నిన్న వీరినెల్ల దన్నినమాట వాస్తవమేయని యావృత్తాంతమంతయుం జెప్పినది.

అప్పుడు రాజపుత్రికను ముద్దుపెట్టుకొనుచు తల్లీ ! సహవాస పరిచయ మూరకబోవదుగదా. నీకు జతఁకాడని యిట్లనుచున్నావా యేమి? నిజము చెప్పుమని పలుసారులడిగి యదార్థము తెలిసికొని యాబాలురతోఁగూడ నుపాధ్యాయుని మందలించి వారికి వేరొక గురువును నియమించి చదువు చెప్పించుచుండెను.

జయసింహుఁడును తేజోవతియు గురువులనొద్ద సంగీతము సాహిత్యము శాస్త్రములు లోనగువిద్యలు మూడు సంవత్సరములలో సాంతముగా గ్రహించిరి. తేజోవతికి యౌవనము పొడసూపినతోడనే బడికిఁ బంపుట మానిపించి కొదవవిద్యలు శుద్ధాంతమునందే నేర్పించితిమి.

జయసింహునకుఁ బాతాళమునంగల ధనుర్వేదము తగినయొజ్జలయొద్ద నేర్పించితిమి కొలదికాలమున అతండు శస్త్రాస్త్ర విద్యానిపుణుండై యెల్లరచేతను పొగడ్తల జెందుచుండెను.

ఒకనాడు తేజోవతి సఖులతోఁగూడా నుద్యానవనములో విహరింపుచు సంగీతము పాడుకొనుచుండఁగా నేలాపుత్రుని కుమారుఁడు పారిజాతఁ డనువాఁడు మిత్రులతోఁ గూడికొని యెక్కడికో పోవుచు నా గానము విని మోహపరవశుండై యందునిలువంబడి పరిజనులచేఁ దీని వృత్తాంతము దెలిసికొని యింటికిం బోయి హంసికయను చేటికను దేజోవతియొద్ద కనిపెను.

ఆ హంసిక తేజోవతితోఁ బారిజాతుని గుణగణంబులు సౌందర్య శౌర్య దైర్యాదులం బొగడి పొగడి యతఁడు నిన్ను వరించి యున్నవాఁడు పెండ్లి యాడుమని బోధించిన అవి పెడచెవినిబెట్టి ఏమియు సమాధానము చెప్పక వేరొక ప్రస్తావన దెచ్చినదఁట. ఆ మాటయే పలుమారు వర్ణింపుచుండెను. మఱియు,

గీ. సకల కాకోదరాన్వయ చక్రవర్తి
    పారిజాతుండు కామినీ పారిజాతుఁ
    డాత్మ నినుఁగోరి గురు విరహమునఁ గుందు
    చున్నవాఁడు త్వదీయ భాగ్యోదయమున ॥